Medaram Jatara 2024 : మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - మొరాయిస్తే ఏం చేస్తారో తెలుసా!
Medaram Maha Jatara 2024 Updates: మేడారానికి ఇవాళ్టి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మొదలయ్యాయి. అయితే మధ్యలో బస్సులను మెరాయిస్తే చేయాల్సిన పనులపై కూడా ఫోకస్ పెట్టింది సర్కార్.
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: తెలంగాణ కుంభమేళ, మేడారం మహాజాతర ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మహా జాతర బ్రహ్మాండంగా జరగనుండగా భక్తులను మేడారం చేరవేయడంలో ఆర్టీసీ దే ప్రధాన పాత్ర. ఇందుకు ఆర్టీసీ కూడా తగిన విధంగా సిద్ధమవగా.. బస్సులకు మెయింటెనెన్స్ కష్టాలు వెంటాడనున్నాయి. దీంతోనే అడపాదడపా బస్సులు ట్రబుల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జాతరకు అన్ని విధాలా సిద్ధమైన ఆర్టీసీ బస్సులు మొరాయిస్తే క్విక్ యాక్షన్ చేపట్టేందుకు కూడా రెడీ అయ్యింది. మొరాయించిన బస్సులను వెంటనే గాడిలో పెట్టేందుకు అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి, భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఇందుకు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు వారందరికీ ఇప్పటికే వివిధ అంశాల్లో ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు.
పర్యవేక్షణకు మొబైల్ టీమ్ లు
రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 51 సెంటర్ల నుంచి మేడారం మహాజాతరకు ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఈసారి ఎక్కువగానే ఉండనుంది. కాగా మేడారానికి ప్రత్యేక బస్సులు ఇవాళ్తి ( ఫిబ్రవరి18) నుంచి ప్రారంభం అయ్యాయి. 24వ తేదీ సమ్మక్క–సారలమ్మ వనప్రవేశ ఘట్ట పూర్తయిన మరుసటి రోజు 25వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నిరంతరాయంగా నడవనున్నాయి. మేడారం జాతర రోడ్లు ఎక్కే ముందుగానే బస్సులను ఓవర్హాలింగ్ చేస్తుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో కూడా చూస్తుంటారు. అయినా అప్పుడప్పుడు బస్సుల్లో సమస్యలు తలెత్తుతుంటాయి. తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో రన్నింగ్ లో ఉన్న బస్ టైర్లు ఊడిపోయిన ఘటన కూడా ఇదే కోవకు వస్తుంది. ఇలా అనుకోకుండా బస్సులకు రిపేర్లు వస్తుంటాయి. ఇక మేడారం జాతర వేళ ఆర్టీసీ బస్సులు మార్గమధ్యలో ఆగిపోయినా, ఫెయిలైనా, ఇతరత్రా ఏ సమస్యలు వచ్చినా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. దీంతోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటనే రిపేర్లు చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు 12 మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేశారు. వారంతా నిరంతరం జాతర విధుల్లోనే ఉండనుండగా.. ఒక్కో టీమ్ లో ఇద్దరు మెకానిక్ లు, ఎలక్ట్రిషియన్ ఉంటారు.
జాతర మార్గంలో క్యాంపులు
ఎప్పుడు ఎలాంటి సందర్భం ఎదురవుతుందో తెలియదు కాబట్టి ఆర్టీసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు మెకానిక్ బృందాలను ఏర్పాటే చేసిన అధికారులు జాతర మార్గంలో ఎక్కడికక్కడ మెయింటెనెన్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ, గుడెప్పాడు, గట్టమ్మ, పస్రా, తాడ్వాయి, జంగాలపల్లి, గణపురం, కాటారం, నార్లాపూర్, కామారం, కొండపర్తి, మేడారం ఇలా మొత్తం 12 చోట్లా టీమ్ లను అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ బస్సు ట్రాఫిక్ లో చిక్కుకుని, కారు లాంటి ఫోర్ వీలర్ బండ్లు చేరుకోలేని ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తితే.. అక్కడికి ద్విచక్రవాహనంపై వెళ్లి రిపేర్లు చేసి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఆయా బృందాలకు సంబంధించిన సభ్యులకు ప్రత్యేకంగా పరిధి కేటాయించి, విధులు అప్పగిస్తున్నారు. ఇక వారి పరిధిలో బస్సుల్లో ఏదైనా లోపాలు తలెత్తితే సాధ్యమైనంతా తొందర్లో వారు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసి, బస్సును మళ్లీ రోడ్డెక్కించేందుకు కృషి చేస్తారు.
అందుబాటులో క్రేన్లు
మెయింటెనెన్స్ క్యాంపుల్లో ఉండే సిబ్బంది వెళ్లి రిపేర్లు చేసినా.. బాగు కాకపోతే ఆయా బస్సులను వెంటనే ఆ రోడ్డు నుంచి తప్పించేలా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యతో నిలిచిపోయిన బస్సును తరలించడానికి ప్రత్యేకంగా క్రేన్, ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. మిగతా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపడతారు. దీంతో మేడారం మార్గంలో బస్సులు నిలిచిపోకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనాలను వెంటనే తరలించేందుకు పెట్రోలింగ్ టీమ్ లు కూడా ఏర్పాటు చేశారు. ఈ పెట్రోలింగ్ టీమ్లు ఎప్పటికప్పుడు మేడారం మార్గంలో పర్యటిస్తూ.. వారివారి పరిధిలో బస్సులు, ఇతర వాహనాలపై దృష్టి పెడతారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే వాహనాల రాకపోకలు క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకుంటారు. ఇలా మేడారం మహాజాతరకు పక్కా వ్యూహంతో సిద్ధమైనట్లు అధికారులు చెబుతుండగా.. వారి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం