Medaram Bike Ambulance : మేడారంలో 40 బైక్ అంబులెన్స్ లు, తక్షణ వైద్య సేవలకు ప్రభుత్వం చర్యలు-medaram news in telugu minister seethakka started 40 bike ambulance immediate medical support ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Bike Ambulance : మేడారంలో 40 బైక్ అంబులెన్స్ లు, తక్షణ వైద్య సేవలకు ప్రభుత్వం చర్యలు

Medaram Bike Ambulance : మేడారంలో 40 బైక్ అంబులెన్స్ లు, తక్షణ వైద్య సేవలకు ప్రభుత్వం చర్యలు

HT Telugu Desk HT Telugu
Feb 17, 2024 10:09 PM IST

Medaram Bike Ambulance : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు వైద్య సదుపాయం అందించేందుకు బైక్ అంబులెన్స్ లను సిద్ధం చేసింది. 40 బైక్ అంబులెన్స్ లు, 21 మెడికల్ కిట్ లను అందుబాటులో ఉంచింది.

మేడారంలో 40 బైక్ అంబులెన్స్ లు
మేడారంలో 40 బైక్ అంబులెన్స్ లు

Medaram Bike Ambulance : వన దేవతల దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులకు అవసరమైన వైద్య సేవలందించడంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇప్పటికే జాతరలో నిరంతర వైద్య సదుపాయం కల్పించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వగా.. తాజాగా బైక్ అంబులెన్స్ (Medaram Bike Ambulance)సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు కోటిన్నర మంది వరకు తరలివచ్చే అవకాశం ఉన్న ఈ మహాజాతరలో అత్యవసర సేవలందించేందుకు జాతరలో బైక్ అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శనివారం మంత్రి సీతక్క, అధికారులతో కలిసి మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో బైక్ అంబులెన్స్ లను ప్రారంభించారు. మొత్తంగా 40 బైక్ అంబులెన్సులను ప్రారంభించగా.. అందులో దాదాపు 21 రకాల మెడికల్ కిట్ అందుబాటులో ఉంటుందని, వాటితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతర(Medaram Jatara)లో ఏటికేడు భక్తుల రద్దీ పెరుగుతోందని, ఆపద సమయంలో భక్తులకు వైద్య సేవలందించడానికి నూతనంగా బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని, భక్తుల రద్దీ పెరుగుతున్నా దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. వైద్యులు దేవుడితో సమానమని, అమ్మ జన్మిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, అన్నిరకాల వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా సమన్వయంతో వనదేవతల దర్శనం చేసుకోవాలని, ఆపద సమయంలో సేవలు అందించే అంబులెన్స్ లకు దారి ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అందుబాటులో 40 బైక్ అంబులెన్స్ లు

మేడారం జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని 40 జీవీకే బైక్ అంబులెన్స్ (Medaram Bike Ambulance)లను అందుబాటులోకి తెచ్చామని వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిరంతరం వైద్య సిబ్బంది ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లలో దర్శనాల కోసం వేచి ఉండే భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ద్రావణాలు అందించాలని సూచించారు.

ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాలి

భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే మేడారం జాతరలో ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా ఆఫీసర్లకు సూచించారు. ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఉంటుందని, ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. గద్దెల ప్రాంగణంలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని, సరిపడా మెడిసిన్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

50 బెడ్లతో టెంపరరీ హాస్పిటల్

సమ్మక్క–సారలమ్మ(Sammakka Saralamma) మహాజాతరకు తరలివచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు మేడారంలోనే 50 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలోనే మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర, జిల్లా స్థాయి ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ మేరకు మేడారం జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. మేడారంలోని ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. మేడారం వెళ్లే రూట్ లో 42 మెడికల్ క్యాంపులు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి క్యాంపులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని రకాల మెడిసిన్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జాతర వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పేషెంట్లను వీలైనంత త్వరగా మెడికల్ క్యాంపులు, సమీపంలోని హాస్పిటళ్లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మెడికల్ క్యాంపుల్లో(Medical camp) ట్రీట్‌మెంట్ చేశాక.. ఇంకా ఉన్నతస్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా హాస్పిటల్స్‌కు, వరంగల్ ఎంజీఎంకు తరలించి చేసి వైద్యం అందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు మేడారం జాతరలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

7 కిలో మీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంప్

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భం భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ(Medaram TSRTC) బేస్ క్యాంపును మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ......మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేస్ క్యాంప్ లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు.

భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.....భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేదీ వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ జాతరకు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం