TG Govt Holiday : ఈనెల 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం - నవంబరులో వచ్చే సెలవు రద్దు!
వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం హాలీ డే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి బదులుగా నవంబర్ 9ని వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది.
ఈనెల 17న వినాయక నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 17న సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 9న వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది. దీంతో నవంబర్ 9న స్కూళ్లు, ప్రభుత్వ విద్యా సంస్థలు పని చేయనున్నాయి.
వినాయక నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ కూడా ఉంది. రెండింటికి కలిపి సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఇవాళ రెండో శనివారం కావటంతో కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు రానున్నాయి.
17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉంది. దీంతో వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. మిలాద్ ఉన్ నబీ పండుగ తేదీ మారింది. నెలవంక దర్శనాన్ని బట్టి మిలాద్ ఉన్ నబీ పండుగను 16న కాకుండా.. 17న జరుపుకోనున్నారు. దీంతో 16వ తేదీన సెలవును రద్దు చేశారు. 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నిజానికి మిలాద్ ఉన్ నబీ హాలీ డే విషయంలో నెలవంక దర్శనం కీలకంగా ఉంటుంది. గతేడాది కూడా ఓ తేదీని నిర్ణయించినప్పటికీ… మరో తేదీలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అయితే 17వ తేదీనే నిమజ్జనం జరగనుంది. ఇదే రోజు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కూడా జరగాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మిలాద్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ర్యాలీ తేదీ మార్పు…!
ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగా… మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను సెప్టెంబరు 19 వ తేదీన నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 17న నిమజ్జనం ఉన్న విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలోనే మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల అనంతరం… ఇదే అంశంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మిలాద్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్-ఉన్-నబీ ర్యాలీ వేడుకలను 19వ తేదీన నిర్ణయించేందుకు అంగీకరించింది. ఇందుకు అనుగుణంగానే మిలాద్ కమిటీ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది. ఫలితంగా వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వేడుకలు వేర్వురు తేదీల్లో జరగనున్నాయి.
ఇక ఈ సెప్టెంబర్ నెలలో చూస్తే 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం కావటంతో ఆ రోజు హాలీ డే ఉంటుంది. దీంతో సెప్టెంబర్ మాసంలో విద్యార్థులకు ఎక్కువ సెలవులు రానున్నాయి.