Cyber Warrior: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్‌ వారియర్... భద్రాద్రి జిల్లాలో పోలీసుల ప్రయోగం..-cyber warrior in every police station experiment in bhadradri disrict ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Warrior: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్‌ వారియర్... భద్రాద్రి జిల్లాలో పోలీసుల ప్రయోగం..

Cyber Warrior: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్‌ వారియర్... భద్రాద్రి జిల్లాలో పోలీసుల ప్రయోగం..

HT Telugu Desk HT Telugu
Apr 03, 2024 12:11 PM IST

Cyber Warrior: సైబర్‌ నేరాల నియంత్రణ కోసం భద్రాద్రి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో సైబర్‌ వారియర్లను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో  సైబర్‌ వారియర్ల నియామకం
భద్రాద్రి కొత్తగూడెంలో సైబర్‌ వారియర్ల నియామకం

Cyber Warrior: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలోనే సైబర్ నేరాల Cyber crime సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచమే ఫోన్ రూపంలో చేతిలో ఇమిడిపోవడంతో ఏ లింక్ క్లిక్ చేస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియడం లేదు. ఏ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏ కబురు వినాల్సి వస్తుందో అంతు చిక్కడం లేదు.

మనోడే కదా అని ఓటీపీ OTP చెబితే ఖాతా ఖాళీ అయ్యే సందర్భాలనూ చవి చూస్తున్నాం. ఇలా అనుకోని రీతిలో సైబర్ నేరానికి గురైతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి బాధితులకు ఎదురవ్వడం సర్వసాధారణంగా మారింది.

ఇలాంటి అయోమయ స్థితిలో ఖంగారు పడకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. "సైబర్ వారియర్" ఇట్టే రంగంలోకి దిగుతాడు. మన సొమ్ములు కాజేసిన నేరగాడికి ముకుతాడు బిగించి మనకు న్యాయం చేస్తాడు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసు అధికారులు చేసిన వినూత్న ప్రయోగం.

సైబర్ నేరాలను అదుపు చేసేందుకు Bhadradri జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక వారియర్ ను నియమించారు. వారికి ఒక ప్రత్యేకమైన ఫోన్ ను అందించి అందులో సిమ్ కార్డును కూడా ఇచ్చారు. ఈ సిబ్బంది విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి సైబర్ నేరం చోటుచేసుకున్న ఈ వారియర్ రంగంలోకి దిగుతారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటై చేసి సైబర్ బాధితుల సేవకు రంగంలోకి దించారు.

ఫోన్లు, సిమ్ కార్డుల అందజేత..

ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జిల్లాలో సైబర్ నేరాల కట్టడి కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణ పొందిన సైబర్ వారియర్స్ ను నియమించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిబ్బందికి ఫోన్లు, సిమ్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక్కో సైబర్ వారియర్ చొప్పున జిల్లాలో 28 మందిని నియమించడం జరిగిందని తెలిపారు. సైబర్ వారియర్స్ గా శిక్షణ పొంది ఆయా పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుందని తెలియజేశారు.

సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930 కి కాల్ చేయడం గానీ, NCRP పోర్టల్ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకే సైబర్ వారియర్స్ ను పోలీస్ శాఖ తరపున ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించడం జరిగిందని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడి ఫిర్యాదు చేసిన బాధితుడికి సంబంధిత పోలీస్ స్టేషన్లో నియమించిన సైబర్ వారియర్ ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలియజేసారు.

జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ క్రైమ్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జితేందర్, సైబర్ సెల్ సభ్యుడు శ్రావణ్, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ -కాపర్తి నరేంద్ర, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం