Hanamkonda : హనుమకొండ జిల్లాలో రైస్ మిల్లర్ల దందా.. రూ.7.5 కోట్ల సీఎంఆర్ మాయం.. బయటపడిన బాగోతం
Hanamkonda : హనుమకొండ జిల్లాలోని మిల్లుల బాగోతం బయటపడింది. ఏకంగా.. రూ.7.5 కోట్ల సీఎంఆర్ మాయం చేశారు. తనిఖీలు చేసిన అధికారులు.. స్కామ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
హనుమకొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) దందా బాగోతం బయట పడుతోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కొన్ని రైస్ మిల్లులు.. అక్రమంగా వాటిని అమ్ముకున్నాయి. రూ.కోట్లు విలువైన బియ్యాన్ని అమ్ముకుని సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేటలోని బాలాజీ ఇండస్ట్రీస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ మేరకు మిల్లు నిర్వాహకులపై క్రిమినల్ కేసులకు సిఫారస్ చేశారు.
పెంచికలపేటలోని బాలాజీ రైస్ మిల్లుకు గత రెండు సంవత్సరాలకు గానూ (2021–22, 2022–23) 6,339 టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించారు. దానికి ప్రకారం మిల్లింగ్ అనంతరం మిల్లు యజమానులు.. 4,310 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ సంబంధిత మిల్లు నిర్వాహకులు కేవలం 1,889 టన్నులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగతా 3,521 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా.. బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం నుంచి పలుమార్లు ఆదేశాలు వచ్చినా సీఎంఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో.. ఆఫీసర్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
రూ.7.5 కోట్ల సీఎంఆర్ మాయం..
ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 3,521 టన్నుల విషయంలో పలుమార్లు అధికారులు మిల్లు నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా మిల్లు నిర్వాహకులు పట్టించుకోకుండా వదిలేశారు. ప్రభుత్వం గడువు ఇచ్చినా స్పందించకపోవడంతో.. శుక్రవారం రాత్రి సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లయిస్ అధికారులు మిల్లుపై రైడ్ చేశారు.
సివిల్ సప్లయిస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేకాధికారి ఎల్.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డీటీ నాగేంద్ర ప్రసాద్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సదానందం, టెక్నికల్ అసిస్టెంట్ కనకాచారి తదితర ఆఫీసర్లతో కలిసి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లుకు కేటాయించిన దాంట్లో పెద్ద మొత్తంలో సీఎంఆర్ మాయమైనట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ప్రభుత్వం పలుమార్లు గడువు ఇచ్చినా స్పందించకపోవడం, సీఎంఆర్ అప్పగించకపోవడం వల్లే దాడులు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మిల్లు యజమాని రవీందర్ రెడ్డిపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. జిల్లాలో చాలా మిల్లులు సీఎంఆర్ రైస్ ఎగవేయగా.. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
మిల్లుల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా.. కొన్ని మిల్లులు మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నాయి. రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని సేకరించి సీఎంఆర్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల హసన్ పర్తి మండలంలోని ఓ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం లభ్యం కావడం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)