Ten Rupee Coins: పది రుపాయల నాణెలు చెల్లుతాయి.. తిరస్కరిస్తే క్రిమినల్ కేసులు…ఆర్‌బిఐ వివరణ
Ten Rupee Coins: దేశంలో పదిరుపాయల నాణెలు చెల్లుబాటులోనే ఉన్నాయని, దైనందిన వినియోగంలో పది నాణెలను తిరస్కరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది.
Ten Rupee Coins: దేశంలో పది రుపాయల నాణెలు చెల్లుబాటులోనే ఉన్నాయని, వాటిని నిరభ్యంతరంగా వినియోగించవచ్చని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. పది నాణెలను తిరస్కరించే వారిపై ప్రజలు క్రిమినల్ కేసులు పెట్టొచ్చని ప్రకటించారు. పది నాణెల వినియోగంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, నాణెలను రద్దు చేశారని పుకార్లు పుట్టించారని ఎలాంటి సంకోచం లేకుండా రూ.10 నాణెలను చలామణీలోకి తీసుకోవాలని రిజర్వు బ్యాంక్ అధికారులు ప్రకటించారు.
తప్పుడు ప్రచారం కారణంగా తలెత్తిన అనుమానాలతోనే ప్రజలు నాణేలను తీసుకోవడానికి విముఖత చూపుతున్నారని ఆర్‌బిఐ వివరించింది. విజయవాడలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన 33వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల భద్రతా సమావేశంలో పది నాణెల వినియోగంపై స్పష్టత ఇచ్చారు. రూ.10 నాణేలపై అపోహలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రిటెయిల్ వ్యాపారులకు నాణెలను పంపిణీ చేశారు.
పది నాణెల జీవిత కాలం ఎక్కువగా ఉంటుందని, నోట్లతో పోలిస్తే వాటి మన్నిక ఎక్కువని ఆర్‌బిఐ అధికారులు వివరించారు. దేశంలో 14 విభిన్న ఆకారాల్లో పదిరుపాయల నాణెలు చెల్లుబాటులో ఉన్నాయి, అన్ని నాణెలు చట్టబద్దమైనవేనని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు నాణెలను అనుమతించాలని సూచించారు.
పది రుపాయల నాణెల చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పది రుపాయిల కాయిన్స్ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రజల్లో నెలకొన్న అపోహల నేపథ్యంలో బ్యాంకుల్లో నాణెల నిల్వలు పెరిగాయని వివరించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరా బాద్ రీజినల్ డైరెక్టర్ కమల్ పి పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చిల్లర కొరత ఉందన్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రకటన జారీ చేసిన తర్వాత రూ.10 నాణేల చెలామణి ఆ రాష్ట్రంలో ఏడు రెట్లు పెరిగిందని చెప్పారు. ఏపీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి నిత్య జీవితంలో నాణెలను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌కు విజ్ఞప్తి చేశారు.
పది రుపాయల నాణెల చెల్లుబాటుపై ఇప్పటికే ఆర్‌బిఐ పలుమార్లు ప్రకటనలు చేసినా ప్రజల్లో ఆశించిన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు చేపడితేనే ప్రజల్లో నాణెలపై నమ్మకం సాధ్యమవుతుందన్నారు.రూ.10 నోట్లతో పో లిస్తే నాణేల జీవిత కాలం రెండు దశాబ్దాలుపైన ఉంటుందని వివరించారు.
రూ.10 నాణెలు చెల్లవనే ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ పరిధిలో రూ.22 కోట్ల విలువైన రూ.10 నాణేలు మింట్‌తో పాటు వివిధ బ్యాంకుల కరెన్సీ చెస్ట్‌లలో ఉండిపోయాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 14 డిజైన్లలో పది రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని, ఇవన్నీ చెల్లుతాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు. ఆర్‌బిఐ విజ్ఞప్తికి స్పందించిన హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్.. ఆర్బీఐ నుంచి లిఖిత పూర్వకంగా ప్రతిపాదనలను పం పితే తక్షణం చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.
ఏపీలో రూ.10 నాణేల చెలామణి పెంచే విధంగా బ్యాంకులు కూడా సహకరించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్లను ఆర్‌బిఐ కోరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పలు వ్యాపార సంస్థలకు రూ.10 నాణేలను అందజేశారు.