Ration Rice Fraud : దారి మళ్లిన రేషన్ బియ్యం, సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా మిల్లుకే!-karimnagar fraud pds rice illegal transport civil supply godown to rice mills ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ration Rice Fraud : దారి మళ్లిన రేషన్ బియ్యం, సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా మిల్లుకే!

Ration Rice Fraud : దారి మళ్లిన రేషన్ బియ్యం, సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా మిల్లుకే!

HT Telugu Desk HT Telugu
Apr 09, 2024 09:54 PM IST

Ration Rice Fraud : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం నేరుగా రైస్ మిల్లులకు పోతున్నాయి. కరీంనగర్ లో సివిల్ సప్లై గోదాం నుంచి నేరుగా రైసు మిల్లుకే రేషన్ బియ్యం రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీఎంఆర్ లోటు పూడ్చుకునేందుకు రైల్ మిల్లర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

దారి మళ్లిన రేషన్ బియ్యం
దారి మళ్లిన రేషన్ బియ్యం

Ration Rice Fraud : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం(Ration Rice) పక్కదారి పడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ దందా హద్దు అదుపు లేకుండా కొనసాగుతుంది. కరీంనగర్ లో సివిల్ సప్లై గోదాం నుంచి రేషన్ బియ్యం నేరుగా నగర శివారులోని ఓ రైస్ మిల్లుకు పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రైస్ మిల్లుపై రైడ్ చేసి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

పౌరసరఫరాల గోదాం నుంచి నేరుగా రైస్ మిల్లుకే

రేషన్ బియ్యం దారి పట్టాయనే సమాచారంతో కరీంనగర్ (Karimnagar)సమీపంలోని దుర్శేడ్ లో గల శ్రీ వెంకటేశ్వర మినీ రైస్ మిల్లులో స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. సుమారు 200 బ్యాగుల బియ్యాన్ని గుర్తించారు. మిల్లు ఆవరణలో టీఎస్ 02 యూడీ 8820 లారీలో రేషన్ బియ్యం సంచులను స్వాధీనం చేసుకున్నారు. అయితే రేషన్ బియ్యం పౌరసరఫరాల గోదాం నుంచి నేరుగా రైస్ మిల్లు(Rice Mill)కే చేరినట్టుగా అనుమానిస్తున్నారు. గన్నీ బ్యాగులు కూడా సివిల్ సప్లై విభాగం సరఫరా చేసినవిగా పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అయితే ఈ బియ్యం ఏ రేషన్ షాపుకు వెళ్లాల్సి ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సివిల్ సప్లై అధికారులు ఇచ్చే వే బిల్లుల ఆధారంగా లారీల్లో తరలించే బియ్యం సంబంధిత షాపుకే చేరవేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నా రవాణా కాంట్రాక్టర్లు బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని పోలీసులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టయితే రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణాకు బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయి. రేషన్ బియ్యం తరలించే లారీలకు జీపీఎస్ సిస్టం అమల్లో ఉన్నా దారి మళ్లించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవాలు తెలియాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కస్టమ్ మిల్లింగ్ రైస్ లోటు పూడ్చేందుకే

సివిల్ సప్లై గోదాం(Civil Supply Godown) నుంచి రైస్ మిల్లు(Rice Mill)కు చేరిన రేషన్ బియ్యం వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లోటును పూడ్చుకునేందుకు తరలించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. జిల్లాలోని చాలా రైస్ మిల్లులు సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్.సి.ఐ కి(FCI) తిరిగి అప్పగించకుండా దొడ్డిదారిన అమ్ముకుని ఇప్పుడు సీఎంఆర్ లోటును పూడ్చేందుకు అక్రమార్గాన రేషన్ బియ్యం(Ration Rice) మిల్లుకు తరలించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు సీజన్ కు సంబంధించిన బియ్యాన్ని చెల్లించాల్సిందేనని సివిల్ సప్లై అధికారులు ఒత్తిడి పెంచడంతో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ లోటును భర్తీ చేసే పనిలో మిల్లర్లు నిమగ్నం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎఫ్సీఐ కి సరఫరా చేసేందుకు సీఎంఆర్ కింద ధాన్యాన్ని సేకరించిన మిల్లర్లు బియ్యాన్ని మాత్రం అప్పగించలేదు. సీఎంఆర్ భర్తీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిళ్లకు గురి చేస్తుండడంతో మిల్లర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో బియ్యాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నాడు పెద్దపల్లి...నేడు కరీంనగర్ లో

గతంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్(Rice Recycling Scam) దందా పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అదే విధంగా ప్రస్తుతం కరీంనగర్ జిల్లా(Karimnagar)లో జరుగుతున్నట్లు తాజా సంఘటన రుజువు చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పదుల సంఖ్యలో అధికారులు కేసులు నమోదు చేసిన అక్రమ దందా ఆగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రైస్ మిల్లు వద్ద పట్టుబడ్డ రేషన్ బియ్యం(Ration Rice)పై లోతైన విచారణలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఏ విషయం బయటకు పోకుండా రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దందా వెనుక ఎవరున్నారు?..అధికారుల పాత్ర ఏంటి?.. సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయి?..అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

HT Correspondent K.V.REDDY, Karimnagar

IPL_Entry_Point