Munugodu Congress : చలమల తిరుగుబాటు, పోటీకి సై అంటున్న కామ్రేడ్లు - హస్తానికి ముప్పేనా..?
Telangana Election 2023: రాజగోపాల్ రెడ్డి రాకతో మునుగోడు కాంగ్రెస్ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. టికెట్ దక్కపోవటంతో… చలమల క్రిష్ణారెడ్డి బరిలో ఉండేలా అడుగులు వేస్తున్నారు. మరోవైపు సీపీఐ కూడా పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
Telangana Assembly Election 2023: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెజారిటీ సీట్లు తామేవన్న భరోసాను వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు రెండు మూడు స్థానాలు పంటి కింద రాయిలా మారనున్నాయా..? ఆ పార్టీ రెండో జాబితా విడుదల చేశాక కూడా ఇంకా మూడు స్థానాల అభ్యర్థుల విషయం పెండింగులోనే పెట్టింది. రెండో జాబితాలో మునుగోడు నుంచి టికెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అక్కడ ఇంటి పోరు తప్పేలా లేదు. ఇదే స్థానం నుంచి ముగ్గురు నాయకులు టికెట్ ఆశించగా.. చలమల క్రిష్ణారెడ్డి ప్రయత్నాల్లో ముందు వరసలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి క్రిష్ణారెడ్డి దగ్గరి అనుచరుడు కావడమే దీనికి కారణం. మరో వైపు ఇదే సీటును వామపక్ష పార్టీల్లో ఒకటైన సీపీఐ కోరుతోంది. కానీ, వారి కోరికను తోసిరాజని అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇపుడు కాంగ్రెస్ మునుగోడులో ఎలా నెగ్గుకు వస్తుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
లోకల్ అంటున్న చలమల క్రిష్ణారెడ్డి
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే విజయం సాధించారు. దాదాపు మూడేళ్ళు పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన సాగుతోందని, కేసీఆర్ ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీకి, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతం బీజేపీలో చేరారు. కొన్నాళ్లకే జరిగిన ఉప ఎన్నికల్లో మునుగోడు నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఉప ఎన్నికలు జరిగి ఇప్పటికి పది నెలలు మాత్రమే. కానీ, ఇంతలోనే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయిందని, కేసీఆర్ ను ఢీకొట్టగలిగేది కాంగ్రెస్ మాత్రమే అని బీజేపీకి రాజీనామా చేసి, సొంత గూటికి చేరారు. గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటే.. శుక్రవారం రెండో జాబితాలో టికెట్ ఖరారు అయ్యింది. కానీ, రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడిన నాటి నుంచి కాంగ్రెస్ జెండాను మోసిన నాయకులు, ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వారికి అరికాలి మంట నెత్తికెక్కింది. మునుగోడు నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతి, ఉప ఎన్నికల సమయంలోనే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన చలమల క్రిష్ణారెడ్డి, బీసీ కోటాలో తనకు టికెట్ వస్తుందని ఆశించిన పున్న కైలాస్ నేత వంటి నాయకులకు అధినాయకత్వం ఇపుడు మొండిచేయి చూపింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నమ్ముకున్న చలమల క్రిష్ణారెడ్డి తనను మోసం చేశారన్న అభిప్రాయినికి వచ్చారు. అవకాశాల కోసం పార్టీలు మారే వారికి టికెట్ ఎలా ఇస్తారని, ఇన్నాళ్లూ పార్టీకోసం పనిచేసిన తమకు ఏం న్యాయం చేస్తారని నిలదీస్తున్నారు. అనుచరులందిరితో చర్చించాక ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. స్థానికుడినైనా తాను ఎక్కడికి పోనని, పోటీలో ఉంటానని పేర్కొన్నారు. దీంతో మునుగోడు కాంగ్రెస్ కు రెబెల్ బెడద తప్పేలా లేదన్న అభిప్రాయం బలపడుతోంది.
ఫ్రెండ్లీ కంటెస్ట్ కు సీపీఐ సిద్ధం
కాంగ్రెస్ లో వామపక్ష పార్టీలు ఎన్నికల పొత్తుపై చర్చలు జరుపుతున్నాయి. వామపక్ష పార్టీల్లో ఒకటైన సీపీఐ మునుగోడును ఆశించింది. గతంలో కాంగ్రెస్ కు సమానంగా ఇక్కడి ప్రాతినిధ్యం వహించిన సీపీఐ పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని కోరుతోంది. కానీ, కాంగ్రెస్ ఆ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీట్లు ఇస్తామని చర్చల్లో ప్రకటించినట్లు సమాచారం. తమకు మునుగోడు కేటాయించాలని, లేదంటే ఇక్కడి నుంచి పోటీలో ఉంటామని సీపీఐ జిల్లా కౌన్సిల్ ఇప్పటికే తీర్మానించి రాష్ట్ర పార్టీకి పంపించింది. నిన్నా మొన్నటి దాకా కొంత ఆశ ఉన్నా.. మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రకటించడంతో.. ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వామపక్షాల పొత్తుతోనే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ గట్టెక్కిందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ ఎన్నికల్లో నిజంగానే అటు పార్టీ రెబెల్ చలమల క్రిష్ణారెడ్డి, ఇటు సీపీఐ పోటీలో ఉంటే కాంగ్రెస్ ఏ విధంగా గెలుస్తుందన్న సంశయం వ్యక్తమవుతోంది.