CM Revanth On Power Cuts : కరెంట్ కోతలపై సీఎం రేవంత్ ఆగ్రహం - అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్-cm revanth warned that strict action will be taken against the responsible if the power supply is interrupted ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth On Power Cuts : కరెంట్ కోతలపై సీఎం రేవంత్ ఆగ్రహం - అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్

CM Revanth On Power Cuts : కరెంట్ కోతలపై సీఎం రేవంత్ ఆగ్రహం - అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 22, 2024 05:44 PM IST

CM Revanth reddy On Power Cuts: అకారణంగా కరెంట్ కోతలు విధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందన్నారు. ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా విద్యుత్ కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి (CMO Telangana)

CM Revanth reddy On Power Cuts: రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ, కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్తు శాఖ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

స‌చివాల‌యంలో గృహ‌జ్యోతి, రూ.500కే సిలిండ‌ర్ పథకాలపై స‌మీక్ష‌కు ముందు ముఖ్య‌మంత్రి విద్యుత్ కోత‌ల‌పై సాగుతున్న ప్ర‌చారంపై అధికారుల‌ను ప్ర‌శ్నించారు. గ‌తేడాదితో పోల్చితే గ‌త రెండు నెల‌ల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా చేసినట్లు ట్రాన్స్ కో జెన్​ కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవ‌ల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల ప‌రిధిలో కొంత సేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింద‌ని తెలిపారు. దానికి కార‌ణాలు ఏమిట‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు స‌రి చూసుకుంటూ ఉండాల‌ని, అలా చూసుకోక‌పోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తింద‌ని అధికారులు తెలియ‌జేశారు. అలా నిర్ల‌క్ష్యంగా, అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏవైనా మ‌ర‌మ్మ‌తులు, ఇత‌ర అంశాల‌కు స‌ర‌ఫ‌రా నిలిపివేయాల్సి వ‌స్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల ప‌రిధిలోని వినియోగ‌దారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు.

గ‌త ప్ర‌భుత్వ‌ హ‌యాంలో నియ‌మితులైన కొంద‌రు క్షేత్ర‌స్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేందుకు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా కోత‌లు పెడుతున్నార‌నే స‌మ‌చారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు. ఎక్క‌డైనా అయిదు నిమిషాల‌కు మించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే అందుకు గ‌ల కార‌ణాల‌పై వెంట‌నే స‌మీక్షించుకోవాలని చెప్పారు. సాంకేతిక‌, ప్ర‌కృతిప‌ర‌మైన కార‌ణాలు మిన‌హా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎవ‌రైనా కోత‌ల‌కు కార‌ణ‌మైతే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్కు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. గత ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది.