CM Revanth - KCR : ఆస్పత్రిలో కేసీఆర్ కు పరామర్శ - ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy said interesting things about meeting kcr in the hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth - Kcr : ఆస్పత్రిలో కేసీఆర్ కు పరామర్శ - ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth - KCR : ఆస్పత్రిలో కేసీఆర్ కు పరామర్శ - ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 07, 2024 01:12 PM IST

CM Revanth Reddy Latest News: ఆస్పత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలుగు టీవీ ఛానెల్(ABN) కు ఇచ్చిన ఇంటర్వూలో పలు అంశాలపై రేవంత్ రెడ్డి స్పందించారు.

ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ (ఫైల్ ఫొటో)
ఆస్పత్రిలో కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ (ఫైల్ ఫొటో) (BRS Twitter)

CM Revanth Reddy - KCR : ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… పరామర్శించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. స్వయంగా వచ్చి కేసీఆర్ ను కలిసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆత్యంత ఆసక్తిని రేపింది. అయితే ఆ రోజు ఏం జరిగింది…? కేసీఆర్ వద్దకు వెళ్లటానికి గల కారణాలేంటి..? వంటి పలు అంశాలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం తెలుగు టీవీ ఛానెల్(ఏబీఎస్ తెలుగు) కు ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చిన సమయంలో…. ఈ అంశంపై మాట్లాడారు.

కేసీఆర్ ఆరోగ్యంపై రాహుల్ గాంధీ అడిగారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశావా…? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారని పేర్కొన్నారు. “ ఓ సందర్భంలో రాహుల్ గాంధీని కలవటానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై నన్ను అడిగారు. కేసీఆర్ గారు హాస్పిటల్ లో ఉన్నారని తెలిసింది ఇప్పుడు ఎలా ఉన్నారని అని అడిగారు.! బాగానే ఉన్నారని తెలిసింది అని చెప్పాను. తెలిసింది అంటున్నావు నువ్వు వెళ్ళి కలవలేదా అని చెప్పారు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావ్… వెళ్లి కలవాలని సూచించారని" రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి సూచనలు వ్యక్తిగతంగా మరింత పరిణితిని సాధించటానికి కూడా ఉపయోగపడుతాయని రేవంత్ రెడ్డి ఏబీఎన్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వూలో అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే ఈ ఇంటర్వూలో అనేక అంశాలపై స్పందిస్తూ… కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు. సాధారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా సీఎం అయితే… పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి అభినందిస్తారని… కానీ ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూర్చుని పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని అలాంటిది ఆయన కనీసం కలవకపోవడం ఏంటో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా జగన్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. ఇక షర్మిల… ఏపీకి కాబోయే పీసీసీ అధ్యక్షురాలు అంటూ హింట్ ఇచ్చారు.

ఇక తెలంగాణలో నామినేటెడ్ పదవులపై స్పందిస్తూ…. ఎన్నికల సమయంలో చాలా మంది నేతలకు హామీలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, ఈరవతి అనిల్ తో పాటు అనేక మందికి టికెట్ ఇవ్వకపోయినా… పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉందని… దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరి 31వ తేదీలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

రుణమాఫీపై మాట్లాడుతూ… ఈ విషయంలో మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి… రుణమాఫీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలాఖరులో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు.

Whats_app_banner