CM Revanth Reddy : ఆ రూటే బెటర్... ఎయిర్‌పోర్టు మెట్రో మార్గంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్-cm revanth reddy clarity on hyderabad metro extension ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఆ రూటే బెటర్... ఎయిర్‌పోర్టు మెట్రో మార్గంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్

CM Revanth Reddy : ఆ రూటే బెటర్... ఎయిర్‌పోర్టు మెట్రో మార్గంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 07, 2024 06:15 AM IST

CM Revanth Reddy On Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించటం వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా లాభం లేదని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On Hyderabad Metro: సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబోలి – ఎయిర్ పోర్టు వరకు 32కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని… దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు వుండటం వల్ల వారు ఎక్కువగా స్వంత వాహనాలు వాడుతున్నారని అన్నారు.

గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్ నుమా - ఏయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు వున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని తెలిపారు. విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడ్డారు.

మూసీ నది పరీవాహక ప్రాంతం అభివృద్ధి…

మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఎరియా, షాపింగ్ మాల్స్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ ను రూపొందించాలని సూచించారు.

ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హొటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని అన్నారు.

హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులు

హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

“ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది” అని రేవంత్ రెడ్డి చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్ లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్ఎస్పీడీసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం