HYD Metro Review: 5 కారిడార్లలో మెట్రో విస్తరణకు సిఎం రేవంత్ ఆదేశం-cm revanth reddy orders for expansion of metro in 5 corridors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Metro Review: 5 కారిడార్లలో మెట్రో విస్తరణకు సిఎం రేవంత్ ఆదేశం

HYD Metro Review: 5 కారిడార్లలో మెట్రో విస్తరణకు సిఎం రేవంత్ ఆదేశం

Sarath chandra.B HT Telugu
Jan 03, 2024 06:49 AM IST

HYD Metro Review: హైదరాబాద్‌ చుట్టూ మెట్రో రైల్‌ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

హెచ్‌ఎండిఏ సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి
హెచ్‌ఎండిఏ సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి

HYD Metro Review: హైదరాబాద్‌ మహానగరానికి నలు దిక్కులా మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐదు కారిడార్‌లలో మెట్రో విస్తరణకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్విఎస్‌ రెడ్డిని ఆదేశించారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌, హెచ్‌ఎండీఏలు సమన్వయంతో హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ రెండో దశ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెట్రో రైల్‌ విస్తరణపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు సూచనలు చేశారు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు, అత్యధిక జనాభాకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

పాతబస్తీలో మెట్రో నిర్మాణం కోసం దారుల్‌షిఫా నుంచి షాలిబండ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. షాలిబండ వరకే కాకుండా ఫలక్‌నుమా వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.

నగరంలోని అన్ని ప్రాంతాలకు దీటుగా పాతబస్తీని అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రోడ్డు విస్తరణ, మెట్రోరైల్‌ ని ర్మాణం అవసరమన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెట్రోరైల్‌ పొడిగింపు కోసం 103 చోట్ల మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు, స్థానికులతో సంప్రదింపులు జరిపేందుకు తాను కూడా వస్తానని సీఎం అధికారులు చెప్పారు.

అటు నుంచే ఎయిర్‌ పోర్ట్‌ కారిడార్…

పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ చేపట్టాలని సీఎం రేవంత్‌ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం సుమారు రూ. 6,250 కోట్లతో ప్రతిపాదించిన 31 కి.మీ. రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మార్గాన్ని నిలిపి వేయాలన్నారు. ఈ మార్గంలో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ మీదుగా అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు మెట్రో మూడో దశ విస్తరణ చేపట్టాలన్నారు.

రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, ఎల్బీనగర్‌ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని సూచించారు.

ఇందులో భాగంగా ఎల్బీనగర్‌-నాగోల్‌ మధ్య 5కి.మీ. మేర మెట్రో చేపట్టాలని సీఎం సూచించారు. ఎయిర్‌పోర్టు మెట్రోపై తక్షణమే ట్రాఫిక్‌ స్టడీస్‌ను పూర్తి చేసి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని మెట్రోరైల్‌ ఎండీ ఎన్విఎస్‌ రెడ్డిని సిఎం రేవంత్‌ ఆదేశించారు. మెట్రోరైల్‌ నిర్మాణంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు.

నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్…

రోజురోజుకు పెరుగుతున్న హైదరాబాద్‌ నగర అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రోత్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

శ్రీశైలం జాతీయ రహదారిపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీకి కూడా ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాంతానికి కూడా మెట్రో కనెక్టివిటీ అవసరమన్నారు.

జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు, కండ్లకోయ/మేడ్చల్‌ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ చేపట్టాలని సూచించారు. రెండో దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదించిన 5 కారిడార్‌లపై వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరికి ముసాయిదా లేఖ పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రతిపాదిత మెట్రో కారిడార్‌లు ఇవే…

► మియాపూర్‌-చందానగర్‌-బీహెచ్‌ఈఎల్‌-పటాన్‌చెరు (14 కి.మీ.)

► ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు-ఎయిర్‌పోర్టు (23 కి.మీ.)

► నాగోల్‌-ఎల్బీనగర్‌-ఒవైసీ హాస్పిటల్‌-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్‌-న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్‌ (19 కి.మీ.)

► కారిడార్‌ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షి యల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు (విప్రో జంక్షన్‌ నుంచి/అమెరికన్‌ కాన్సులేట్‌) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, ఐఎస్‌బీ రోడ్డు (12 కి.మీ.)

► ఎల్బీనగర్‌-వనస్థలిపురం-హయత్‌నగర్‌ (8 కి.మీ.)

IPL_Entry_Point