Prof Kodandaram : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నేడో, రేపో నూతన ప్రభుత్వం కొలువు దీరనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కృషి ఉంది. అయితే ఇందులో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. కేసీఆర్ ను గద్దె దింపడానికి ప్రొఫెసర్ కోదండరాం గత కొన్ని రోజులుగా అన్నీ జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.
ఈసారి టీజేఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతుంది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయనకు టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులది కీలక పాత్ర. తెలంగాణలో ప్రభుత్వం మారటానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. గ్రూప్ -1,2 నిర్వహణ విఫలం, పేపర్ లీకులు, ఛైర్మెన్ ను మర్చకపోవడం వంటి అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఇక ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ హామినిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ గా నిరుద్యోగుల బాధలు తెలిసిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాంకు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్