సచివాలయంలో పంచాయత్ రాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పంచాయతీ ఎన్నికలు, కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేకేతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ధరణి సమస్యలపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. దీనిపై అసెంబ్లీలోనూ చర్చించి అందరి సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా సమగ్రమైన చట్టం రూపొందించాలని ఆదేశించారు.
అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని చెప్పారు. డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందన్నారు.
గతంలో 30 వేల మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్ ఆపరేటర్స్‌కు కూడా ఉన్నారని… వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు ప్రభుత్వం తరపున అభినందిస్తున్నామని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారిచ్చే సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.