Telangana Assembly 2024 Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. కేంద్ర బడ్దెట్ లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందన్న విషయంపై పలువురు సభ్యులు మాట్లాడారు. నిధులు కేటాయింపై ఢిల్లీలో ముఖ్యమంత్రితో పాటు మొత్తం కేబినెట్ దీక్షకు దిగాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్ పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసేందుకు తాను సిద్ధమన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా రావాలని… ఇద్దరం కూడా దీక్షకు కూర్చుంద్దామని సవాల్ విసిరారు. తేదీని డిసైడ్ చేసి చెప్పాలని…. దీక్షకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. నిధులు తెచ్చుడో..సచ్చుడో అన్నది తేల్చుకుందామని కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో అమాయకులను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయేందుకు కారాణం అయ్యారని ఆరోపించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ…. సీఎంతో పాటు మొత్తం కేబినెట్ ఢిల్లీలో దీక్షకు దిగాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వారికి రక్షణగా నిలుస్తామని చెప్పుకొచ్చారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కేంద్ర పద్దులో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
తెలంగాణకు కేంద్రం చేస్తున్నది వివక్ష కాదని… కక్ష అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రం వెంటనే రీబడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేటాయింపులు జరగాలన్నారు. తెలంగాణ నుంచి లక్షల కోట్ల రూపాయల పన్నులు వెళ్తున్నాయన్నారు. కానీ వచ్చేది మాత్రం ఏమీ లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తుందన్నారు. ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించిందన్నారు. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మధ్యాహ్నం తర్వాత కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సభలో చర్చ మొదలైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సభలో ప్రకటన చేసింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. ఏపీకి కేంద్రం ఏమిచ్చినా తమకు అభ్యంతరం లేదని… దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
దీనిపై బీఆర్ఎస్ తరపున కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర బడ్దెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానానికి తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి చాలా సార్లు విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ…. ఎలాంటి సాకారం అందలేదన్నారు. ఇదే విషయం ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రసంగం ప్రారంభమైన సమయంలో కొన్ని వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం సభను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చిందే మీ అభిప్రాయమా.? అంటూ బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న ఆయన… స్వయం కృషితో సభలోకి వచ్చానని కామెంట్స్ చేశారు. తండ్రిపేరు చెప్పుకుని రాలేదని.. వివాదాల వైపు చర్చలొద్దని హితవు పలికారు.