Prajapalana Program : రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమం- సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ-cm revanth reddy announced prajapalana program from september 17 for ration card health cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Prajapalana Program : రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమం- సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ

Prajapalana Program : రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమం- సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ

Bandaru Satyaprasad HT Telugu
Aug 27, 2024 06:55 PM IST

Prajapalana Program : రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల ప్రొఫైల్ కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం
రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం

Prajapalana Program : తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వైద్య రంగం అభివృద్ధికి బడ్జెట్లో రూ.11,500 కోట్లు కేటాయించామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో సర్కారు దవాఖానాల్లో వైద్య సేవల నాణ్యత ప్రమాణాలు పెరిగాయన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. అప్పట్లో సుమారు 1.25 కోట్ల ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయిని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రూ.500 గ్యాస్ సిలిండర్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. మరోసారి ప్రజాపాలన దరఖాస్తులు ఆహ్వానించి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కోసం వివరాలు సేకరించనున్నారు.

గోషామహల్ కు ఉస్మానియా ఆసుపత్రి తరలింపు

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించాలని నిర్ణయించారు. స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ తరలింపునకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్కిటెక్ట్‌లతో సంప్రదించి ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు ఉండాలన్నారు. అదనంగా ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి రోడ్ కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు.

హెల్త్ డిజిటల్ కార్డులు జారీపై

మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి... ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా... రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా...? వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు.

ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం హెచ్చరించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

Whats_app_banner

సంబంధిత కథనం