Flood Damage : ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయండి: రేవంత్ రెడ్డి
Flood Damage : తెలంగాణ సచివాలయంలో కేంద్ర బృందంతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. తెలంగాణలో వరద నష్టం అంచనాపై చర్చించారు. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టంపై పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం.. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు నిధి ఏర్పాటు చేయాలని కోరారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం యాక్షన్ ప్లాన్ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు.. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప కాగి, ఎస్కే కుష్వాహ, టి.నియల్ఖాన్సన్, డాక్టర్ శశివర్ధన్ రెడ్డిల బృందం ఖమ్మం నగరంతోపాటు చుట్టుపక్కల ఏరియాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రెండు బృందాలుగా విడిపోయి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, కాల్వొడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ మున్నేరు వంతెన ప్రాంతం, మోతీ నగర్‌లోని రాజీవ్ గృహకల్పలో ఒక బృందం పర్యటించింది. రెండో బృందం నగరంలోని దానవాయిగూడెం, తల్లంపాడు- తెల్దారుపల్లి, ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు, ప్రకాష్ నగర్‌లో పర్యటించి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని సర్వే చేసింది.
వరద విస్తీర్ణం, వరద ఉధృతి, నష్టం వివరాలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు. గనులు, భూగర్భ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో బృందం పరిశీలించిందని, అలాగే ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా నష్టం ఎంత ఉందో స్పష్టంగా తెలుసుకున్నామని కల్నల్ సింగ్ వివరించారు. నష్టంపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.
వరద కారణంగా.. కోతకు గురైన పొలాలు, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి కేంద్ర బృందం ప్రతినిధులు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంట నష్టంపై అన్నదాతలు తమకు జరిగిన నష్టాన్ని బృందం సభ్యులకు వివరించారు. జాతీయ రహదారిపైనే పాలేరు నియోజకవర్గంలో జరిగిన వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. పంటల సాగుకు ఎంత ఖర్చయింది? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.