AP Medical Colleges : ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌, రెండు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి-amravati nmc grants permission to two new medical colleges in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Medical Colleges : ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌, రెండు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి

AP Medical Colleges : ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌, రెండు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 05:25 PM IST

AP Medical Colleges : ఏపీలో రెండు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిష‌న్లు చేప‌ట్టడానికి అనుమ‌తులు మంజూరు చేసింది. పులివెందుల, పాడేరు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి ఇచ్చింది.

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌, రెండు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌, రెండు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి

AP Medical Colleges : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి ఇచ్చింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి ఒక్కో కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిష‌న్లు చేప‌ట్టడానికి నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ (ఎన్ఎంసీ) అనుమ‌తులు మంజూరు చేసింది. క‌డ‌ప (పులివెందుల‌), పాడేరు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి ఇచ్చింది.

వాస్తవానికి ఈ రెండు కళాశాల‌ల‌తో పాటు, ఆదోని, మార్కాపురం, మ‌ద‌న‌ప‌ల్లె మెడికల్ కళాశాల్లో ఒక్కో చోట 150 సీట్లతో త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌ని గ‌త ప్రభుత్వంలోనే చ‌ర్యలు ప్రారంభించింది. అయితే కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగ‌స్వామ్యం (పీపీపీ) మోడ‌ల్‌లో నిర్వహించేందుకు టీడీపీ కూట‌మి ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఐదు మెడిక‌ల్ కాలేజీల్లో తొలి విడ‌త త‌నిఖీల అనంత‌రం కొంతమేర వ‌స‌తుల కొర‌త ఉన్నాయ‌ని ఎన్ఎంసీ అనుమ‌తులు నిరాక‌రించింది. తొలి విడ‌త త‌నిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివ‌రి నిమిషంలో అధికారుల‌కు అనుమ‌తులిచ్చిన‌ప్పటికీ వ‌స‌తుల క‌ల్పన మాత్రం చేప‌ట్టలేదు. దీంతో గ‌త ప్రభుత్వంలో క‌ల్పించిన వ‌స‌తుల ఆధారంగా వ‌ర్చువ‌ల్ ఇన్‌స్పెక్షన్ అనంత‌రం ప్రభుత్వం అండ‌ర్ టేకింగ్ ఇస్తే పులివెందుల‌కు 50 సీట్లు మంజూరు చేస్తామ‌ని ఎన్ఎంసీ ప్రక‌టించింది. అయిన‌ప్పటికీ ప్రభుత్వం అండ‌ర్‌టేకింగ్ ఇవ్వలేదు. అండ‌ర్‌టేకింగ్ ఇవ్వక‌పోయిన‌ప్పటికీ ఎన్ఎంసీ అనుమ‌తులు మంజూరు చేసింది.

గ‌తేడాది ఏపీలోని ఐదు మెడిక‌ల్ కాలేజీలు(నంద్యాల‌, మ‌చిలీప‌ట్నం, ఏలూరు, రాజ‌మండ్రి, విజ‌య‌న‌గ‌రం)ల‌కు ఎన్ఎంసీ అనుమ‌తి ఇచ్చింది. తాజాగా మ‌రో రెండు కాలేజీల‌కు అనుమ‌తి మంజూరు అయింది. ఇంకా ఆదోని, మార్కాపురం, మ‌ద‌న‌ప‌ల్లె కాలేజీల‌కు అనుమ‌తులు రావాల్సి ఉంది. గ‌త ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడిక‌ల్ కాలేజీల‌కు ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది. ఈ కొత్త మెడిక‌ల్ కాలేజీల్లో 2,550 వైద్య సీట్లు కొత్తగా వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు. అయితే ఇప్పటికే నంద్యాల‌, మ‌చిలీప‌ట్నం, ఏలూరు, రాజ‌మండ్రి, విజ‌య‌న‌గ‌రం మెడిక‌ల్ కాలేజీలు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించ‌డంతో 750 సీట్లు వ‌చ్చాయి. అయితే ఈ ఏడాది ఏడు కొత్త మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభించాల్సి ఉండ‌గా, ఎన్ఎంసీ రెండు కాలేజీల‌కు మాత్రమే అనుమ‌తి ఇచ్చింది.

పులివెందుల కాలేజీకి అనుమ‌తి వ‌ద్దు

క‌డ‌ప జిల్లాలోని పులివెందుల మెడిక‌ల్ కాలేజీకి అనుమ‌తి వ‌ద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని సమాచారం. ఈ మేరకు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ (ఎన్ఎంసీ)కి లేఖ రాసింద‌ని వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తుంది. మెడిక‌ల్ సీట్లు ఇస్తామంటే వ‌ద్దని చెబుతోందని, మెడిక‌ల్ కాలేజీ నిర్వహ‌ణ త‌మ వ‌ల్ల కాదంటూ ఎన్ఎంసీకి లేఖ రాసింద‌ని ఆరోప‌ణ‌లు చేస్తుంది. పులివెందుల ప్రభుత్వ వైద్య కాలేజీకు అనుమ‌తి ఇస్తూ 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ కేటాయించింది. అయితే అనుమ‌తులు వెన‌క్కి తీసుకోవాల‌ని ఎన్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాసిందని తెలుస్తోంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం