Ambedkar Statue : అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ.. హెలికాప్టర్ ద్వారా పూలజల్లు, ముఖ్య అతిథిగా ఒకే ఒక్కరు
Ambedkar Statue Unveiling in Hyderabad: హైదరాబాద్‌లో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భారీగా జరిపేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా విడుదలైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్… అధికారులకు దిశానిర్దేశం చేశారు.
125 Feet Ambedkar Statue in Hyderabad: సకల జనులందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేథావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. తన దూరదృష్టితో ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరిచారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు.. అందరివాడు అని కొనియాడారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సీఎం కేసీఆర్ చెప్పారు.
దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు సీఎం కేసీఆర్. అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా వుండాలని మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ గారి పుట్టిన రోజు సందర్భంగా తలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమం.. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాల పై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
’’ నేను ఊహించిన దానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని ఉన్న అంబేద్కరుడు ఒక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు’’ అని సిఎం కేసీఆర్ తన ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహా రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్..కృషిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘‘ దేశం గర్వించదగ్గ రీతిలో అందరివాడు డా.బిఆర్ అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ దేశం ప్రజల కోసం భవిష్యత్తు తరాల కోసం రాజ్యంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసా పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరం. కేవలం దళితులు,గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు... వివక్షను ఎదుర్కునే ప్రతీ చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారమవుతుంది. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి ఒక్కటని చెప్పలేము. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే..’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకున్నామన్నారు. ఇటువంటి చారిత్రాత్మక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని మంత్రులకు, ఉన్నతాధికారులకు సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి అభిమానులు సామాజిక వేత్తలు సామాన్యులు వారి సందర్శనకోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఎండాకాలం కావడంతో నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీల్లు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లన్ని మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు.
తీసుకున్న నిర్ణయాలివే :
• ఏప్రిల్ 14 న జరిగే డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా, కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలి.
• ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత తెలంగాణ ప్రదాతకు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి.
• గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి.
• 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి అతి పెద్ద క్రేన్ ను ఉపయోగించాలి.
• ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి.
• ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది అధికారులతో పాటు అన్ని శాఖల హెచ్ఓడిలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు (రాజ్యసభ, లోక్ సభ) , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు హాజరుకావాలి.
• ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
• ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలి.
• హైదరాబాద్ చేరుకునే లోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లను చూసుకోవాలి. సభానంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి.
• ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర సల్ల ప్యాకెట్లు (విజయ డైరీవారి), లక్షన్నర వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
• పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వున్నందున, విగ్రహ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం వినియోగించుకోవాలి. ప్రజలకు ఎండవేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయాలి.
• ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగు బాధ్యతను హైదరాబాద్ సీపీ తీసుకోవాలి. పార్కింగుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలి.
• సభ రోజు సామాన్య ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీస్ యంత్రాంగం చూడాలి.
• సంబంధించిన ఏర్పాట్లలో హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డిజిపి అంజన్ కుమార్, సీపీ సీవి ఆనంద్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శులు అధికారులు బాధ్యత వహించాలి.
• ఈ సందర్భంగా ఘనమైన రీతిలో ఆట పాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఇందుకు గిడ్డంగుల శాఖ చైర్మన్, గాయకుడు సాయిచంద్ తో కలిసి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కార్యక్రమాలను రూపొందించాలి.
• అంబేద్కర్ కు సంబంధించిన పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ తదితర ముందస్తు సన్నద్దత బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకోవాలి.
• డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలి.
• విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డా. బిఆర్ అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ను మాత్రమే ఒకే ఒక ముఖ్య అతిథిని ఆహ్వనించాలని నిర్ణయం.
• అంబేద్కర్ మహాశయుని ఔన్నత్యాన్ని చాటే విధంగా దేశవ్యాప్తంగా ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలి.
• ఇందుకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ తగు చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
• ఈ సందర్భంగా సభికులకు అనువుగా ఎల్ ఈ డీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలి.
• సభికుల కోసం 40 వేల కుర్చీలను ఏర్పాటు చేయాలి.
• ఎంపిక చేయబడిన ఆహ్వానితులు సంబంధిత మేధావులు తదితర ప్రముఖుల కోసం పాస్ లు రూపొందించి జారీ చేయాలి.
• అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలి.
• ఏప్రిల్ 14 నాడు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది.
• ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమవుతుంది. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగం వుంటుంది. అనంతరం ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సందేశం ఉంటుంది. సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా గారి ధన్యవాద ప్రసంగంతో సభ ముగుస్తుంది.