Ambedkar Statue : ఏప్రిల్ నాటికి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం….-125 feet ambedkar statue will be ready by april government spends 300 crores for construction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambedkar Statue : ఏప్రిల్ నాటికి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం….

Ambedkar Statue : ఏప్రిల్ నాటికి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం….

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 07:58 AM IST

Ambedkar Statue విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. విగ్రహ నిర్మాణ వేగాన్ని పెంచాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించారు. హర్యానాలో తయారవుతున్న అంబేడ్కర్ విగ్రహాన్ని విడి భాగాలుగా మార్చి విజయవాడకు తరలిస్తున్నారు.

అంబేడ్కర్ విగ్రహ భాగాలను పరిశీలిస్తున్న మంత్రులు
అంబేడ్కర్ విగ్రహ భాగాలను పరిశీలిస్తున్న మంత్రులు

Ambedkar Statue ఃఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులను ఏప్రిల్ 14 కల్లా పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో శరవేగంగా జగరుతున్న విగ్రహ ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం మంత్రులు పరిశీలించారు.

విజయవాడలో అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగిన చోట, ఎంతో ఖరీదైన ప్రాంతంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా డా. బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఇప్పటికే 248 కోట్లు వెచ్చించామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసం చేయలేదన్నారు. విజయవాడకు అంబేడ్కర్ విగ్రహం బూట్లు వచ్చాయని, మిగతా భాగాలు రవాణా అవుతున్నాయని , మిగిలిన భాగాలు క్రమంగా వస్తున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత ఖర్చైనా చెప్పిన సమయానికి నిర్మాణం పూర్తిచేస్తున్నామని, అందరూ సహకరించాలని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. బీ.ఆర్. అంబేడ్కర్ భావజాలాన్ని, స్పూర్తిని నలుదిక్కులా వ్యాప్తిచేయాలనే లక్ష్యంతో విజయవాడ నగరం నడిబొడ్డున దాదాపు 3వేల కోట్ల విలువైన స్వరాజ్య మైదానంలో విగ్రహ ఏర్పాటు, ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు.

విగ్రహానికి సంబంధించిన అన్ని విడిభాగాలు ఒక్కొక్కటిగా ప్రాంగణానికి చేరుకుంటున్నాయని చెప్పారు. నిర్మాణ పనులు శరవేగంగా జరగుతు న్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేయడం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ముఖ్యమంత్రి ఆకాంక్ష అని మంత్రి తెలిపారు.

రాష్ట్ర మంత్రివర్గంలో 70 శాతం మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారినే తీసుకుని సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ ఉండరని తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, మౌలిక సదుపాయాల కార్పోరేషన్, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టినట్టు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. సంక్షేమ ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి?, నాయకుడంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమమే నిదర్శమన్నారు. నిర్మాణ పనులతో నగర ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, చిన్న వీధులలో నివాసితులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సురేష్ సూచించారు.