Civils Topper Uma Harathi: వైఫల్యాలే విజయానికి పునాది అంటున్న సివిల్స్ టాపర్ ఉమా హారతి
Civils Topper Uma Harathi: సివిల్స్ సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలు చవి చూశానని, వైఫల్యాలు ఎదురైనా అనుకున్నది సాధించాలనే తపనతోనే విజయాన్ని సాధించినట్లు యూపీఎస్సీలో మూడో ర్యాంకు సాధించిన ఉమా హారతి వెల్లడించారు.
Civils Topper Uma Harathi: సివిల్స్ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను చవి చూశానని, తండ్రి ఇచ్చిన ప్రేరణ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే వైఫల్యాలను అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు సివిల్స్ టాపర్ ఉమా హారతి వెల్లడించారు.
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి పలు మార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు.
తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఉమా హారతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించడానికి ఐదుసార్లు ప్రయత్నించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ దక్కించుకున్నారు. సివిల్స్ లక్ష్యంగా శ్రమిస్తున్న వారితో తన సందేశాన్ని పంచుకున్నారు. తమ ప్రయత్నంలో విఫలమైనా ఫర్వాలేదని, తాను కూడా చాలా సార్లు విఫలమయ్యానని, విద్యార్ధులు తమ గురించి గర్వపడాలని సూచించారు.
హైదరాబాద్ ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఉమ, సివిల్స్ 2022లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన మహిళల్లో ఒకరిగా నిలిచారు. తనకు "ఇది ఐదవ ప్రయత్నమని, సివిల్స్ లక్ష్యాన్ని సాధించడం సుదీర్ఘ ప్రక్రియ అని అదేమి సులభం కాదన్నారు. ఇది ఒక గొప్ప ప్రయాణమని, తన తప్పుల నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ విజయానికి చేరువైనట్లు చెప్పారు.
చదువుకునే రోజుల నుంచి తన తండ్రి తనను సివిల్ సర్వీసెస్ వైపు ప్రేరేపించారని తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బిటెక్ పట్టా పొందిన ఉమ, సివిల్స్ ప్రజలకు సేవ చేయడానికి అత్యుత్తమ వేదిక అని మొదట్నుంచి ప్రేరణ ఇచ్చారని వివరించారు. కెరీర్‌లో అర్ధవంతమైన పని ఏదైనా చేయగలగడానికి సివిల్ సర్వీసెస్ చక్కటి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇంటర్వ్యూకు హాజరైన సమయంలో ‘‘ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నానని, మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదన్నారు. రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్నని వివరించారు. ముందు జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండేదని ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారినట్లు వివరించారు. ఐదేళ్లుగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పారు. సివిల్స్‌కు హాజరయ్యే క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి అండదండలు, ఎమోషనల్ సపోర్టు చాలా అవసరమని చెప్పారు. అది ఉంటే లక్ష్యాన్ని చేరుకోగలిగానన్నారు. పరీక్షలకు కావాల్సిన సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయని ఎమోషనల్ సపోర్ట్ , ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదని ఎవరికైనా అదే చాలా అవసరం అన్నారు. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే దీనిని సాధించవచ్చన్నారు’’
‘‘ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయినా నిరాశ పడొద్దని ఎవరి నుంచైనా మనం స్ఫూర్తి పొందవచ్చని తాను ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నానని వివరించారు. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్ చూశానని, అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లానన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగంలో చేరలేదని సివిల్స్ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు వివరించారు. సివిల్స్ సాధించే వరకు పరీక్షలు రాద్దామని నిర్ణయించుకొని రాశానని, ఫ్రెండ్స్ చాలా సపోర్టు చేశారన్నారు. తాను సాధించిన విజయానికి నూటికి నూరు శాతం తండ్రే స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చారన్నారు.
విజయానికి ఒకే ఫార్ములా లేదని, ఏదైనా సాధించాలంటే పట్టుదల కీలకమని ఆమె అన్నారు. విద్యార్థులు ఎంత అవసరమో అంత మాత్రమే చదవాలని ఆమె అన్నారు. సివిల్స్‌కు హాజరయ్యే వారు అతిగా చదవవద్దని, ఎంత అవసరమో చదివి చాలా సాధన చేయండి. ఇది పోటీ పరీక్ష కాబట్టి ప్రతి ఒక్కరు సొంత వ్యూహాన్ని కలిగి ఉండాలని సూచించారు. సివిల్స్ పరీక్షలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు సహా 933 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని కమిషన్ ఈరోజు తెలిపింది. టాప్ 25లో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు.