Hyderabad : ఫ్రీ హలీం ఆఫర్, పోటెత్తిన జనం.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు-chaos after hyderabad restaurant offers free haleem cops resort to lathicharge ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : ఫ్రీ హలీం ఆఫర్, పోటెత్తిన జనం.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు

Hyderabad : ఫ్రీ హలీం ఆఫర్, పోటెత్తిన జనం.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 13, 2024 11:14 AM IST

Free Haleem in Hyderabad : రంజాన్ మొదటి రోజు సందర్భంగా ఉచితంగా హలీమ్ ఇవ్వాలని హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ప్రజలు అక్కడికి భారీగా చేరుకోవటంతో పరిస్థితి తారుమారైంది. రంగంలోకి దిగిన పోలీసులు… లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

ఫ్రీ హలీం ఆఫర్
ఫ్రీ హలీం ఆఫర్ (PTI)

Hyderabad : హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్‌(Halim) ఆఫర్ ను ప్రకటించింది. రంజాన్(Ramdan 2024) మాసం మొదటి రోజు సందర్భంగా ఈ ప్రకటన చేసింది. దీంతో జనాలు భారీగా పొటెత్తారు. ఓ దశలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు…. హోటల్ వద్దకు చేరుకున్నారు. జనాలను నియంత్రించేందుకు ప్రయత్నించగా పరిస్థితి అదుపులోకి రాలేదు. గుంపులుగా ఉన్న జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు.

yearly horoscope entry point

న్యూస్ ఏజెన్సీ ANI కథనం ప్రకారం… రంజాన్ మొదటి రోజు ప్రజలకు ఉచితంగా హలీమ్(Free Haleem Offer in Hyderabad) ఇవ్వాలని రెస్టారెంట్ యాజమాన్యం నిర్ణయించిందని రాసుకొచ్చింది. అయితే, హోటల్ నిర్వాహకులు రద్దీని నియంత్రించలేకపోయారు, తరువాత, గుంపును చెదరగొట్టడానికి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ట్రాఫిక్ సమస్యలకు కారణమైన హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని మలక్ పేట ఇన్ స్పెెక్టర్ శ్రీనివాస్…. టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

“ఉచిత హాలీమ్ ఆఫర్ గురించి హోటల్ యాజమాన్యం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేస్తాం’’ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Ramzan 2024: రంజాన్ మాసం ప్రారంభం

Ramadan 2024: మార్చి 12వ తేదీ నుంచి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు(Ramadan 2024) ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఉపవాసం ఉండి అల్లాహ్ ని ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ మాసంగా పేర్కొంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికత ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అల్లాని ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు. నెల రోజుల పాటు ఈ మాసంలో ఉపవాసం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆహారం, పానీయాలు, శారీరక అవసరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. తప్పనిసరిగా ఖురాన్ పఠిస్తారు.

ఉపవాసం అనేది ఇస్లాం ఐదు సూత్రాలలో ఒకటి. స్వీయ క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మికం వంటి వాటిని ప్రతిబింబిస్తుంది. కుటుంబం స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. ఏవైనా పొరపాట్లు, తప్పులు చేస్తే క్షమాపణల కోరుకుంటూ అల్లాను ప్రార్థిస్తారు. సూర్యోదయంలోపు ఉపవాసం ప్రారంభం కాకముందు చేసే భోజనాన్ని సెహరీ అంటారు. సాయంత్రం ఉపవాసం విరమించడం తర్వాత చేసేదాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం సమయం సుమారు 12 గంటలకు పైగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలను అనుసరించి సెహ్రీ, ఇఫ్తార్ విందులు ఉంటాయి. రంజాన్ మాసంలో ఉపవాసం పాటించడం వల్ల అల్లాహ్ సంతోషిస్తాడని, చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.

రంజాన్ మాసంలో(Ramadan 2024) చేసే ప్రార్థనలు అసమానమైన పుణ్యాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు. ప్రతిరోజు చేసే నమాజ్ కాకుండా ఈ మాసంలో చేసే నమాజ్‌కు వంద రెట్లు పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ పట్ల విధేయత, భక్తిని చూపిస్తూ ఉపవాసం ఉంటారు. తన దృష్టి మొత్తం ప్రార్థన మీద నిలుపుతారు. దైవిక ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ మాసం ఉపయోగపడుతుంది. దయతో చేసే పనులు అల్లాని సంతోషపరుస్తాయని నమ్ముతారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు ఐదు సార్లు మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తారు. అలా చేయడం కుదరని వాళ్ళు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ నమాజ్ చేస్తారు.

Whats_app_banner