Huzurabad MLA Camp Office : హుజురాబాద్ లో మరో రాజకీయ రగడ..! హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పనులు
Changes in Huzurabad MLA Camp Office : హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో చేపట్టిన మార్పు పనులు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తు దోషం పేరుతో క్యాంప్ ఆఫీస్ ముఖద్వారం కూల్చివేత పనులు ప్రారంభించగా… కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకున్నారు.
Changes in Huzurabad MLA Camp Office : మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు...! నిన్న జిల్లా పరిషత్తులో అధికారుల తీరుపై ఆందోళన.. నేడు వాస్తు దోషంతో ఎమ్మెల్యే అధికారిక నివాసం రీ డిజైన్ రగడ... హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి రాజకీయంగా దుమారం రేపుతోంది. విమర్శలు ఆరోపణ పరస్పర ఫిర్యాదులు, పోలీస్ కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుతో అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే శైలి వివాదాస్పదం…..!
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయి, మండలిలో విప్ గా పనిచేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ పని చేసిన వివాదాస్పదమవుతుంది. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కౌశిక్ రెడ్డి తాజాగా హుజురాబాద్ లో ఎమ్మెల్యే అధికారిక నివాసం క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషంతో రీ డిజైనింగ్ పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది.
వాస్తు దోషం ఉందనే కారణంతో ముఖద్వారం కూల్చివేసే ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేయడంపై కాంగ్రెస్ బిజెపి నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళనకు దిగారు.
నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేసిన వారిపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కు చెందిన మాజీ సర్పంచ్ నేరెళ్ళ మహేందర్ గౌడ్, తిప్పారపు సంపత్, బిజేపి జిల్లా కార్యదర్శి మాజీ సర్పంచ్ కరుణాకర్, గంగిశెట్టి రాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వాస్తు దోషం పేరుతో అధికారిక నివాసంలో అనుమతి లేకుండా కూల్చివేత పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాధనంతో నిర్మించిన ఎమ్మెల్యే అధికారిక నివాసాన్ని కూల్చిన వారిపై ఆందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆస్థులు ద్వంసం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిచో జరగబోయే పరిణామాలకు అధికారులే భాద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నలుగురిపై కేసు నమోదు….
ఎమ్మెల్యే అధికారిక నివాసం రీ డిజైన్ పనులు చేపట్టగా కాంగ్రెస్ బిజేపి నాయకులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహెందర్ గౌడ్, కరుణాకర్, తిప్పరపు సంపత్, గంగిశెట్టి రాజు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్యాంప్ కార్యాలయం వద్ద పనులు అడ్డుకోవడంతోపాటు దౌర్జన్యంగా తన కార్యాలయంలోకి వెళ్ళిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికంగా లేని ఎమ్మెల్యే ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. పోలీసులు సైతం నోరు విప్పడం లేదు.
రీ డిజైన్ పనులకు బ్రేక్….
కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో క్యాంపు ఆఫీస్ వాస్తు దోషంతో రీ డిజైన్ చేస్తున్నట్టుగా లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నట్టే అయిందన్న వాదనలు కాంగ్రెస్ నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో సంబంధిత శాఖల అధికారులకు తెలియకుండా మరమ్మత్తులు చేయడం చట్టవిరుద్దమని అంటున్నారు.
ఎమ్మెల్యే పై కాంగ్రె,స్ బిజెపి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే… కాంగ్రెస్ బిజెపి నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్యాంప్ ఆఫీస్ రీ డిజైనింగ్ పనులకు బ్రేక్ పడింది. పరస్పర పిర్యాదులు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే అధికారులు ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.