BRS Leaders on Chandrababu : చంద్రబాబుకి బీఆర్ఎస్ మంత్రుల కౌంటర్.. ఎవరేమన్నారంటే.. !-brs ministers and leaders counter to chandrababu statements ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Leaders On Chandrababu : చంద్రబాబుకి బీఆర్ఎస్ మంత్రుల కౌంటర్.. ఎవరేమన్నారంటే.. !

BRS Leaders on Chandrababu : చంద్రబాబుకి బీఆర్ఎస్ మంత్రుల కౌంటర్.. ఎవరేమన్నారంటే.. !

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 05:52 PM IST

BRS Leaders on Chandrababu : తెలంగాణను తానే అభివృద్ధి చేశానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు విరుచుకుపడ్డారు. బాబు హయాంలోనే తెలంగాణ ప్రాంతం ఎక్కువగా దోపిడీకి గురైందని ఆరోపించారు. బీజేపీ మెప్పు కోసమే తెలంగాణలో బాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబుకి బీఆర్ఎస్ మంత్రుల కౌంటర్
చంద్రబాబుకి బీఆర్ఎస్ మంత్రుల కౌంటర్

BRS Leaders on Chandrababu : తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని... బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనలోనే తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తీసుకుని, సీలేరు ప్రాజెక్టుని గుంజుకున్నారని విమర్శించారు. తన పాలనలో ఏపీని అప్పుల పాలు చేసి.. అక్కడి ప్రజల చేత ఛీత్కారానికి గురై .. ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. పాలన బాగాలేదని ఏపీ ప్రజలు బాబుని ఓడగొట్టారని.. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ రాజకీయాలు సాగవని... మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్.. ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఖమ్మంలో చంద్రబాబు తెలుగుదేశం శంఖారావం సభపై స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్ లో చెల్లని రూపాయి, తెలంగాణలో చెల్లుతుందా ? అని మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఖమ్మంలో చంద్రబాబు షో చూస్తుంటే.. గూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయితీస్తా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల పాలు చేసిన బాబు.. తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో బాబు పాలనలోనే తెలంగాణ ప్రాంతం ఎక్కువగా దోపిడీకి గురైందని విమర్శించారు. యువత, రైతులతోపాటు ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం యువత కొట్లాడితే.. నక్సలైట్ల పేరుతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని.. తెలంగాణ సమాజం ఆ ఘటనలను ఇంకా మరచిపోలేదని అన్నారు. ఫ్రీజోన్ పేరుతో హైదరాబాద్ ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువతకి తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యవసాయ దండగ అని నిర్లక్ష్యం చేస్తే.. కేసీఆర్ పండగలా మార్చారని హరీశ్ అన్నారు. ఆంధ్రలో బీజేపీతో పొత్తు కోసం బాబు పాకులాడుతున్నారని... అందుకే తెలంగాణకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పుడున్న తెలుగుదేశం .. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఏం చేశారో తెలుగు ప్రజలకు తెలుసునని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

తన పాలనలో ఖమ్మం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చంద్రబాబు చెప్పారని... కానీ అదంతా అవాస్తవమని... జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఏడు మండలాలు తీసుకొని, సీలేరు ప్రాజెక్టుని గుంజుకున్నది బాబే అని విమర్శించారు. ఖమ్మంకు చంద్రబాబు పాలనలో ఒక్క ప్రాజెక్టు తీసుకువచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాల పూర్తి తన స్వార్జితమని.. తన కష్టంతో స్థాపించానని పువ్వాడ చెప్పారు. మెడికల్ కళాశాల ఏర్పాటులో బాబు పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ పాలనలో ఖమ్మం ప్రజలంతా చాలా సుఖంగా ఉన్నారని.. దండ యాత్రలా మా మీదకు రావద్దని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంతా చూస్తున్నారని.. అక్కడి ప్రజలు పారిపోయి తెలంగాణకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుని తెలంగాణ ప్రజలు వద్దని పంపించేశారని... మళ్లీ వచ్చి రాజకీయాలు చేస్తే పాత అనుభవాలే పునరావృతం అవుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో సాగవని తేల్చిచెప్పారు. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా.. చంద్రుడు ఒక్కడే అన్నట్టు.. తెలంగాణలో కేసీఆర్ ఒక్కరేనని అభివర్ణించారు. రాజకీయాల పేరుతో రాష్ట్రానికి ఎంత మంది వచ్చినా.. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

Whats_app_banner