Telangana BJP First List : అసెంబ్లీ బరిలో ముగ్గురు ఎంపీలు, 2 స్థానాల నుంచి ఈటల పోటీ - ఆసక్తికరంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్-bjp releases first list of 52 candidates for telangana elections bandi sanjay kumar contest from karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Bjp First List : అసెంబ్లీ బరిలో ముగ్గురు ఎంపీలు, 2 స్థానాల నుంచి ఈటల పోటీ - ఆసక్తికరంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్

Telangana BJP First List : అసెంబ్లీ బరిలో ముగ్గురు ఎంపీలు, 2 స్థానాల నుంచి ఈటల పోటీ - ఆసక్తికరంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 22, 2023 01:33 PM IST

Telangana BJP First List For Assembly Polls 2023: 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. ఇందులో పార్టీ తరపున ఎంపీలుగా ఉన్న వారి పేర్లు కూడా ఉన్నాయి. ఈటల రాజేందర్ రెండు చోట్ల(గజ్వేల్, హుజురాబాద్) పోటీ చేయనున్నారు.

బీజేపీ తొలి జాబితా విడుదల
బీజేపీ తొలి జాబితా విడుదల

Telangana BJP First List For Assembly Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. ఇందులో కీలక నేతల పేర్లను ఖరారు చేసింది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ను… కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ ను కోరుట్ల అభ్యర్థిగా, ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావును బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసింది. మరోవైపు తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు కనిపించలేదు. ఇక ఈటల రాజేందర్.. గజ్వేల్, హుజురాబాద్ నుంచి పోటీ చేయనున్నారు.

సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమా రెడ్డి పేరును ప్రకటించింది బీజేపీ. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. ఇక బీఆర్ఎస్ నుంచి చేరిన బోగా శ్రావణికి జగిత్యాల టికెట్ ఖరారైంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు మానకొండూరు సీటును ప్రకటించింది బీజేపీ. ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీటును ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు అవకాశం దక్కకపోగా… ఈ సీటును నోముల దయానంద్ గౌడ్ కు ఖరారు చేసింది. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు…ఈ లిస్టులో లేకపోవటం కొసమెరపు.

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా:

  1. సిర్పూర్ - పాల్వాయి హరీశ్ బాబు
  2. బెల్లంపల్లి (ఎస్సీ) - అమరాజుల శ్రీదేవి
  3. ఖానాపూర్ (ఎస్టీ) - రమేశ్ రాథోడ్
  4. ఆదిలాబాద్ - పాయల్ శంకర్
  5. బోథ్(ఎస్టీ) - బాపూరావ్(ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు)
  6. నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
  7. ముథోల్ - రామరావు పటేల్
  8. ఆర్మూర్ - రాకేశ్ రెడ్డి
  9. జుక్కల్ (ఎస్సీ) - టి. అరుణతార
  10. కామారెడ్డి - వెంకటరమణారెడ్డి
  11. నిజామాబాద్ అర్బన్ - సూర్యనారాయణ గుప్తా
  12. బాల్కొండ - అన్నపూర్ణమ్మ
  13. కోరుట్ల - ధర్మపురి అర్వింద్(నిజామాబాద్ ఎంపీ)
  14. జగిత్యాల - బోగా శ్రావణి
  15. ధర్మపురి(ఎస్సీ) - ఎస్ కుమార్
  16. రామగుండం - సంధ్యారాణి
  17. కరీంనగర్ - బండి సంజయ్ కుమార్(ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ)
  18. చొప్పదండి(ఎస్సీ) - బొడిగే శోభ
  19. సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి
  20. మానకొండూరు (ఎస్సీ) - ఆరెపల్లి మోహన్
  21. హుుజురాబాద్ - ఈటల రాజేందర్
  22. నర్సాపూర్ - ఎర్రగొల్ల మురళీ యాదవ్
  23. పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్
  24. దుబ్బాక - రఘునందన్ రావు
  25. గజ్వేల్ - ఈటల రాజేందర్
  26. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
  27. ఇబ్రహీంపట్నం - నోముల దయానంద్ గౌడ్
  28. మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్
  29. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
  30. కార్వాన్ - అమర్ సింగ్
  31. గోషామహల్ - రాజాసింగ్
  32. చార్మినార్ - మేఘా రాణి
  33. చంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్
  34. యాకుత్ పుర- వీరేందర్ యాదవ్
  35. బహుదూర్ పుర - వై నరేశ్ కుమార్
  36. కల్వకుర్తి - టి. ఆచారి
  37. కొల్లాపూర్ - సుధాకార్ రావు
  38. నాగార్జున సాగర్ - నివేదితా రెడ్డి
  39. సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వరరావు
  40. భువనగిరి - గూడురు నారాయణ రెడ్డి
  41. తుంగతుర్తి(ఎస్సీ) - కడియం రామచంద్రయ్య
  42. జనగాం - దశ్మంథ్ రెడ్డి
  43. స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ) - విజయ రామరావు
  44. పాలకుర్తి - రామ్మోహన్ రెడ్డి
  45. డోర్నకల్ (ఎస్టీ) - భూక్యా సంగీత
  46. మహబూబాబాద్ (ఎస్టీ) - హుస్సేన్ నాయక్
  47. వరంగల్ పశ్చిమ - రావు పద్మా
  48. వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్ రావు
  49. వర్థనపేట(ఎస్సీ) - కొండేటి శ్రీధర్
  50. భూపాలప్లలి - చందుపట్ల కీర్తి రెడ్డి
  51. ఇల్లందు (ఎస్టీ) - రవీంద్ర నాయక్
  52. భద్రాచలం (ఎస్టీ) - కుంజ ధర్మారావు

ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది. ఇందులో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఉంది. దీంతో గజ్వేల్ గడ్డపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయ పోరు సాగటం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో భారీగా ముదిరాజ్ సామాజికవర్గ ఓట్లు ఉండటంతో… గెలుపుపై ఈటల రాజేందర్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner