Bhadradri Kothagudem Accident : భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర ప్రమాదం, వంతెనపై నుంచి వాగులో పడిన టెంపో- నలుగురు మృతి!
Bhadradri Kothagudem Accident :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో వాహనం వంతెనపై నుంచి వాగులో పడిన నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు.
Bhadradri Kothagudem Accident :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బూర్గంపాడు వద్ద వంతెనపై నుంచి టెంపో వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారికి బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పపత్రిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఏపీ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం తిరుమలదేవిపేటకు చెందిన కుటుంబం భద్రాచలం రామాలయానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
అసలేం జరిగింది?
భద్రాద్రి శ్రీరాముని దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న ఓ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఏపీ-తెలంగా సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన ఆరుగురు పెద్దలు, ఆరుగురు పిల్లలు టెంపో వాహనంలో భద్రాద్రి సీతారాములను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం కిన్నెరసాని వాగు సమీపంలో అదుపుతప్పి వంతెన పై నుంచి కిందికి దూసుకెళ్లింది.
నలుగురు మృతి
ఈ ఘోర ప్రమాదంలో దుర్గారావు(40), శ్రీనివాసరావు(35) అక్కడికక్కడే మృతిచెందారు. నిర్మల అనే మహిళను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు చిన్నారులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రదీప్(10), సందీప్(12) చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాదం అలముకుంది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో గుల్లకోట గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెదారు. వేంపల్లిలోని ఓ పెళ్లికి హాజరైన బత్తుల శంకరయ్య(60), లచ్చవ్వ(55) తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన శంకరయ్య, లచ్చవ్వ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.