Hyderabad Public School Admissions : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Hyderabad Public School Admissions : అర్హులైన షెడ్యూల్ కులాల విద్యార్థులకు 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 25- మార్చి 12వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయాల్లో అప్లికేషన్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.
Hyderabad Public School Admissions : బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(Hyderabad Public School ) లో అర్హులైన షెడ్యూల్ కులాల విద్యార్థులకు 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఈ మేరకు ప్రకటనలు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదు. అప్లికేషన్ ఫామ్ లను ఫిబ్రవరి 25- మార్చి 12వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయాల్లో పొందవచ్చని అధికారులు తెలిపారు.
కామారెడ్డిలో
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 2024-25 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ప్రవేశాలకు(Admissions) దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. షెడ్యూల్డ్ కులాల బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో ఈ నెల 24 నుంచి మార్చి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందజేస్తారని తెలిపారు. అయితే దరఖాస్తుదారులు 2017 జూన్ 1 నుంచి 2018 మే 31 మధ్యన జన్మించి ఉండాలని పేర్కొన్నారు. మార్చి 15వ తేదీన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో ఎంపిక చేపడతామన్నారు.
గద్వాలలో
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కోసం జోగులాంబ గద్వాల జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. విద్యార్థి పేరు మీద కుల ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు. అర్హులైన వాళ్లు దరఖాస్తు ఫామ్ లను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో, గద్వాలలోని ఐ.డి.ఓ.సి కాంప్లెక్స్ రూమ్ నెంబర్ ఎఫ్-8 పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 12 చివరి తేదీ అన్నారు. ఇతర సమాచారం కోసం 8309540738 నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు. లక్కీ డిప్ ద్వారా మార్చి 15న విద్యార్థిని ఎంపిక చేస్తామన్నారు.
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు
గిరిజన విద్యార్ధులకు మెరుగైన విద్యా, ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మొత్తం 1380 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల వారీగా సీట్లను కేటాయిస్తారు. పూర్తి వివరాలను ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో https://tserms.telangana.gov.in లో లభిస్తాయని గురుకుల విద్యాలయాల సంస్థ డైరెక్టర్ సీతాలక్ష్మీ పేర్కొన్నారు.