BJP Praja Sangrama Yatra: ఈనెల 12 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర - రూట్ మ్యాప్ ఇదే
Praja Sangrama Yatra 4th Phase: ఈ నెల 12వ తేదీ నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్నారు. మొత్తం 11 రోజుల పాటు.. 110కి.మీ. మేర పాదయాత్ర సాగుతుంది.
Bandi Sanjay Praja Sangrama Yatra:నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర తేదీ ఖరారైంది. ఈనెల 12 నుండి చేపట్టే యాత్ర రూట్ మ్యాప్ విడుదలైంది. యాత్రకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఈసారి మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల నుంచి బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. గణేష్, విజయదశమి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పాదయాత్రను 10 రోజులకే పరిమితం చేశారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు వివరాలు వెల్లడించారు.
ప్రకటనలో ఏం చెప్పారంటే
• బండి సంజయ్ 4వ విడత పాదయాత్రను ఈనెల 12 నుండి 22 వరకు మల్కాజ్ గిరి పార్లమెంట్ లో నిర్వహించాలని నిర్ణయించాం. గణేష్, దసరా నవ రాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రను 10 రోజులకే కుదించాం. ఈ పాదయాత్ర మూడు కమిషనరేట్ల పరిధిలో విస్తరించినందున ఆయా కమిషనరేట్లకు పాదయాత్ర వివరాలను అందజేశాం.
•ఈనెల 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద 10.30 గంటలకు బండి సంజయ్ పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు. 11 గంటలకు సమీపంలోని రాంలీలా మైదానంలో ప్రారంభ సభ నిర్వహిస్తాం. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొంటారు.
• అక్కడి నుండి కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్పీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో పాదయాత్రను ముగిస్తాం. ముగింపు సభకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారు. ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం. ముగింపు స్థలం ఎక్కడనేది ఇంకా ఖారారు కాలేదు. త్వరలోనే రూట్ కమిటీ ఫైనల్ చేస్తుంది. ఇప్పటి వరకు 40 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర పూర్తి కొనసాగింది. 4వ విడతతో కలిపి మొత్తం 48 అసెంబ్లీ నియోజకవర్గాల్ల పాదయాత్ర పూర్తి కానుంది.
•కాలనీల్లో దోమల బెడద, మంచి నీటి సమస్య, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్ పై వ్యాట్ తగ్గింపు వంటి అంశాలపైనా పాదయాత్రల చర్చిస్తాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో విచ్చల విడిగా ఫీజుల దోపిడీ, ఆసుపత్రుల్లో ఎడాపెడా ఫీజుల మోత వంటి అంశాలు కూడా పాదయాత్ర సందర్భంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. అంతిమంగా రాబోయే ఎన్నికలకు ప్రజలను సంసిద్ధం చేసి టీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నాం.
ఇప్పటికే మూడు దశల్లో ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేశారు బండి సంజయ్. అయితే మూడో దశ చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఓ దశలో యాత్రను ఆపివేయాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. హైకోర్టు అనుమతితో తిరిగి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాల్గో విడత యాత్ర ఎలా సాగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.