Bandi Sanjay : ప్రజా సంగ్రామ యాత్రలో ఘర్షణ…. బీజేపీ, టిఆర్‌ఎస్ మధ్య దాడులు….
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలకుర్తిలో అభివృద్ధి జరగలేదంటూ బండి సంజయ్ విమర్శించడంతో టిఆర్ఎస్ శ్రేణులు ఎదురు దాడికి దిగాయి. ఇది కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
పంద్రాగస్టు వేళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని రెండు పార్లమెంటరీ నియోజక వర్గాల పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం జనగామ జిల్లాల్లో సంజయ్ యాత్రను టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.
బండి సంజయ్ పాదయాత్రలో టిఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదంలో పదుల సంఖ్యలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. బండి సంజాయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ఐదు జిల్లాల్లో రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని మండలకేంద్రాలు, గ్రామాలు, పుణ్యక్షేత్రాల మీదుగా సాగుతోంది. యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రం నుంచి మొదలైన యాత్రం జనగామజిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించింది. స్థానికంగా చిన్నపాటి సమావేశాన్ని నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. గ్రామంలోకి బండి సంజయ్ యాత్రను బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఆ పార్టీ యువకులు బాణాసంచాలతో ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో నిరుద్యోగ సమస్యను బండి సంజయ్ ప్రస్తావించడంతో అక్కడే ఉన్న టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయన్ని నిలదీశారు. కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్‌ఎస్ కార్యకర్తల్ని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది.
పాలకుర్తి నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎవరికి ఉద్యోగాలు రాలేదని కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు చేయడంతో టిఆర్‌ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు గ్రామంలో ఉద్దేశపూర్వకంగానే తమ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించి గొడవలు పెట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీ యాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు బీజేపీ-టిఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరుపక్షాల వారిని చెదరగొట్టారు. దాడుల్లో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు టిఆర్‌ఎస్ దాడుల గురించి పోలీసులకు ముందే తెలిసినా కావాలనే పట్టించుకోలేదని సంజయ్ ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇరుపక్షాల మధ్య దాడుల నేపథ్యంలో సంజయ్ భద్రతను పోలీసులు అప్పటికప్పుడు పెంచారు. అదనపు భద్రత తనకు అవసరం లేదని బండి సంజయ్ నిరాకరించారు. తమ కార్యకర్తలపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.
టాపిక్