Kakatiya University Exams : విద్యార్థుల ఇంటికే ఆన్సర్ బుక్ లెట్స్..! కేయూలో బయటపడ్డ బాగోతం-answer booklets were taken to the homes of the students in kakatiya university ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatiya University Exams : విద్యార్థుల ఇంటికే ఆన్సర్ బుక్ లెట్స్..! కేయూలో బయటపడ్డ బాగోతం

Kakatiya University Exams : విద్యార్థుల ఇంటికే ఆన్సర్ బుక్ లెట్స్..! కేయూలో బయటపడ్డ బాగోతం

HT Telugu Desk HT Telugu
Jun 01, 2024 07:50 AM IST

Warangal Kakatiya University : కాకతీయ వర్శిటీలో మరో బాగోతం వెలుగు చూసింది. ఆన్సర్ బుక్ లెట్స్ ను గుట్టుగా విద్యార్థులకు చేరవేస్తున్న వ్యవహారం బయటికి వచ్చింది. ఫలితంగా రెండు రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ నిలిపివేశారు.

కేయూలో బయటపడ్డ బాగోతం
కేయూలో బయటపడ్డ బాగోతం

Warangal Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో మరో బాగోతం బయట పడింది. వర్సిటీ పరీక్షల విభాగంలో డిగ్రీ సెమిస్టర్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుండగా, కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది దినసరి కూలీలు ఆ బండిల్స్ నుంచి ఆన్సర్ బుక్ లెట్స్ ను గుట్టుగా విద్యార్థులకు చేరవేశారు. 

సదరు విద్యార్థులు జవాబులు రాసిన అనంతరం వాటిని తిరిగి యథావిధిగా బండిల్స్ లోకి చేర్చారు. వారం రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, కాకతీయ యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షల విభాగంలో పని చేస్తున్న దినసరి కూలీలను తొలగించి, రెండు రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ నిలిపివేశారు.

అసలేం జరిగింది..?

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణ అనంతరం విద్యార్థుల ఆన్సర్ బుక్ లెట్స్ అన్నింటినీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కు తరలిస్తున్నారు. ఇదిలాఉంటే డిగ్రీ పూర్తి చేసే విద్యార్థుల సౌకర్యం కోసం ఆరో సెమిస్టర్ పేపర్ల మూల్యాంకనం ప్రారంభించారు. ఇప్పటికే ఆయా పరీక్షలు పూర్తి కావస్తుండగా, మే 23న జరిగిన ఓ ఘటన ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీని కుదిపేస్తోంది. 

వర్సిటీ పరీక్షల విభాగంలో దాదాపు 25 మంది దినసరి కూలీలుగా పని చేస్తుండగా, అందులో మాదాసి సునీల్, గడ్డం రాణా ప్రతాప్, నాసం శ్రీధర్ అనే ముగ్గురు వ్యక్తులు అక్రమాలకు తెరలేపారు. ఎవరికీ ప్రవేశం ఉండని మూల్యాంకన క్యాంప్ లోకి ఎంటర్ అవడంతో పాటు అందులో నుంచి కొన్ని ఆన్సర్ బుక్ లెట్స్ తీసుకుని బయటకు వచ్చారు.

వాటిని ఆయా పేపర్ల విద్యార్థులకు చేరవేసి, వారు ఆన్సర్స్ రాసిన తరువాత వాటిని యథావిథిగా సంబంధిత బండిల్స్ లోకి చేర్చారు. ఆ ఘటన వారం రోజులకు మే 30వ తేదీన పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ డా.తిరుమలదేవి సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా, గుర్తించి కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కంట్రోలర్ నరిసింహచారి, అడిషనల్ కంట్రోలర్ తిరుమలదేవి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాల్యూయేషన్ నిలిపివేత…

ఓ వైపు పోలీసులు విచారణ జరుపుతుండగా, కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఆరో సెమిస్టర్ ఆన్సర్ బుక్ లెట్ల మూల్యాంకనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వర్సిటీ పరీక్షల విభాగంలో పని చేస్తున్న మిగతా దినసరి కూలీలను తొలగించి, రెగ్యులర్ ఉద్యోగులకు విధులు కేటాయిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల పాటు మూల్యాంకనం నిలిపి వేశారు. దీంతో సోమవారం మూల్యాంకన ప్రక్రియ తిరిగి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో పేపర్ కు రూ.10 వేల వరకు వసూలు

వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేయూ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముగ్గురూ కలిసి 50 ఆన్సర్ బుక్ లెట్స్ ను బయటకు తీసుకెళ్లి, మళ్లీ బండిల్స్ లోకి చేర్చారని ప్రాథమికంగా నిర్దారించినట్లు సమాచారం. కాగా ఒక్కో పేపర్ కు సదరు సిబ్బంది ఐదు వేల రూపాయల నుంచి 10 వేల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదిలాఉంటే వారంతా కొన్నేళ్ల ఉంచి ఇదే పరీక్షల విభాగంలో పని చేస్తుండగా, ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఇలా ఆన్సర్ బుక్ లెట్స్ మార్పిడి చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ముగ్గురు సిబ్బంది కూడా వారికి తెలిసిన స్టూడెంట్స్, ఉద్యోగుల ద్వారానే ఈ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తోంది. 

ఇదిలాఉంటే వారు మార్చిన 50 బుక్ లెట్స్ లో అత్యధికంగా నగరంలోని ఓ బడా ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్థులే ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి మూల్యాంకన క్యాంపులోకి సాధారణ వ్యక్తులకు అంత ఈజీగా ప్రవేశం ఉండదు. అలా గదిలోకి దినసరి కూలీలు ఈజీగా ఎంటర్ కావడం, బుక్ లెట్స్ మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పరీక్షల విభాగంలోని కొందరు అధికారుల సహకారం కూడా వీరికి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులు ఆ దిశగా కూడా ఆరా తీస్తున్నారు. పరీక్షల విభాగంలోని వాల్యూయేషన్ క్యాంప్ నుంచి పేపర్ బండిల్స్ లో ఆన్సర్ బుక్ లెట్స్ మార్చిన వ్యవహారం వర్సిటీలో హాట్ టాపిక్ గా మారగా, దీనిపై లోతుగా విచారించి బాధ్యులందరిపైనా తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner