Annaram Barrage : అన్నారం బ్యారేజీలో లీకేజ్, సీఎం కేసీఆర్ వాస్తవాలు నిర్థారించాలి- కొండా విశ్వేశ్వర్ రెడ్డి-annaram barrage water leakage bjp konda vishweshwar reddy demands kcr confirmation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Annaram Barrage : అన్నారం బ్యారేజీలో లీకేజ్, సీఎం కేసీఆర్ వాస్తవాలు నిర్థారించాలి- కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Annaram Barrage : అన్నారం బ్యారేజీలో లీకేజ్, సీఎం కేసీఆర్ వాస్తవాలు నిర్థారించాలి- కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Nov 01, 2023 03:21 PM IST

Annaram Barrage : కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీలో వాటర్ లీకవుతుంది. ఈ ఘటనపై వాస్తవాలు నిర్థారించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అన్నారం బ్యారేజీ
అన్నారం బ్యారేజీ

Annaram Barrage : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద నిర్మించిన బ్యారేజీ 4వ బ్లాక్ లోని 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్​లీకవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ట్వీట్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనపై వాస్తవాలను నిర్థారించగలరా? అంటూ సీఎం కేసీఆర్‌ ను ప్రశ్నించారు.

'కాళేశ్వరం అన్నారం బ్యారేజ్ 4వ బ్లాక్, పిల్లర్ నెం. 41 దిగువ నుంచి నీరు, ఇసుక కొట్టుకుపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు రెండు రోజులుగా ఇసుక బస్తాలు వేస్తున్నారు. ప్రవాహ వేగంతో పిల్లర్ బేస్ నుంచి ఇసుక కొట్టుకుపోకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు'- అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు.

అన్నారం, సుందిళ్ల పరిశీలన

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీని నిర్మించారు. 66 గేట్లతో 1.2 కి.మీ పొడవుతో అన్నారం సరస్వతి బ్యారేజీని నిర్మించారు. అయితే బ్లాక్ 4 వద్ద బ్యారేజ్ బేస్మెంట్ కింది నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. రాళ్లు, సిమెంట్ బస్తాలతో గండిని పూడ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 8.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని సమాచారం. నీళ్లను బయటకు వదిలితేనే సమస్య మొదలైన ప్రదేశం గుర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇటీవల మేడిగడ్డను పరిశీలించి ఇరిగేషన్ అధికారులు... అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించాలని తెలిపారు. అన్నారం బ్యారేజీ గేట్ల కింద ఇసుక మేట వేయటం, నీరు బయటకు వచ్చే చోట కొన్ని బ్లాక్స్ జరగడం వంటి సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటితో బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నిర్వహణలో భాగంగా అన్నారం, సుందిళ్లను కూడా పరిశీలిస్తామని, ఇది క్రమం తప్పకుండా చేసేవని ఇరిగేషన్ అధికారులు ఇటీవల తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ ఘటన

అక్టోబర్ 22న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ రెండు అడుగల మేర కుంగిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 7వ బ్లాక్​లోని 20వ నంబర్‌‌‌‌ పిల్లర్‌‌ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుంగింది. దీంతో దీనికి ఇరువైపులా ఉన్న 19, 21వ పిల్లర్లపైనా భారం పడింది. నీటి ప్రవాహానికి ఇసుక కొట్టుకుపోవడం కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఇవి సాధారణ సమస్యలను ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇందులో నిర్మాణలోపాలు లేవని వివరణ ఇచ్చారు.

Whats_app_banner