Narsapur Congress : నర్సాపూర్ లో టికెట్ వార్... గాలి అనిల్ కుమార్ తిరుగుబాటు బావుటా
Telangana Assembly Elections 2023: నర్సాపూర్ టికెట్ దక్కకపోవటంపై ఆ పార్టీ నేత గాలి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ కి నర్సాపూర్ నియోజకవర్గంలో టికెట్ ఆశించిన నాయకులూ, పార్టీ నాయకత్వం ఆవుల రాజి రెడ్డికి టికెట్ ప్రకటించడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.నర్సాపూర్ నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్… రాజి రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన సునీతా లక్ష్మా రెడ్డికి, రాజి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్ గా వ్యవరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. పటాన్చెరుకు చెందిన తాను… పటాన్చెరు టికెట్ ఆశించానని, కానీ పార్టీ నాయకత్వం నర్సాపూర్ లో పనిచేసుకోమంటే, ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని బలపర్చడానికి తీవ్రంగా కృషిచేశానని అన్నారు. అయితే పార్టీ నిర్ణయం తనను తీవ్ర నిరుత్సహానికి గురిచేసింది అన్నారు. రెండు మూడు రోజుల్లో పార్టీ నాయకత్వం తమ నిర్ణయం మార్చుకొని, తనను అభ్యర్థిగా ప్రకటించకపోతే తాను తన భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అనిల్ కుమార్ పార్టీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేసారు.
గాలి కి మద్దతుగా పలువురు కీలక నేతలు ..
అనిల్ కుమార్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన కీలక నేతలు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ తో పాటు,నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులూ అనిల్ కుమార్ కు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో, ఎన్నికలు సమిపిస్తున్న సమయంలో పార్టీ నిట్ట నిలువునా చీలే పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితిల్లో,పార్టీ నాయకత్వం కలిపించుకొని అనిల్ కుమార్ కి నచ్చచెప్పకపోతే అనిల్ కుమార్ నిర్ణయం పార్టీ విజయ అవకాశాల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అనిల్ కుమార్ 2019 లో మెదక్ లోక్ సభ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా సుమారుగా 3 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. లోక్ సభ ఎన్నికల్లో అనిల్ కుమార్ కి , నర్సాపూర్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు పడ్డాయి.
దామోదరపై ఆరోపణలు ...
జిల్లాలో కీలక నేతగా ఉన్న, దామోదర రాజనరసింహ… పటాన్ చెరువు లో తన శిష్యుడైన కాటా శ్రీనివాస్ గౌడ్ కి 2018లో టికెట్ ఇప్పించుకున్నాడు. పటాన్చెరు టికెట్ పైన ఆశలు వొదులుకున్న, గాలి అనిల్ కుమార్ కొంత కాలంగా నర్సాపూర్ పైన దృష్టి సారిస్తే ఇక్కడ కూడా దామోదర రాజనరసింహ కల్పించుకొని రాజి రెడ్డి కి టికెట్ ఇప్పించాడని అనిల్ కుమార్ అనుచరులు ఆరోపిస్తున్నారు.