Ganesh Immersion : ఆ పని చేయొద్దు ప్లీజ్.. ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి విజ్ఞప్తి!
Ganesh Immersion : గణపతి నిమజ్జనం నేపథ్యంలో అన్ని శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పోలీస్, జీహెచ్ఎంసీ భక్తులకు సూచనలు చేస్తున్నారు. తాజాగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట భక్తులకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రంగుల పేపర్లు, రిబ్బన్లు వేయొద్దని కోరారు.
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'వినాయక నిమజ్జనం సందర్భంగా.. మిషన్లతో గాల్లోకి కలర్ కాగితాలు ఎగేరేయటం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చు. కానీ ఆ రోడ్లన్నీ శుభ్రపరచడానికి ఆ చెత్తను సేకరించటానికి జీహెచ్ఎంసీ సిబ్బందికి కొన్ని రోజులు పట్టి.. కష్టమవుతుంది. అలాగే ఆ చెత్త.. డ్రైనేజ్ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్డుపై వరదకు కారణం అవుతుంది. ఇలాంటి రంగుల కాగితాలు, ప్లాస్టిక్‌తో కూడుకున్న రిబ్బన్లు రోడ్లపై ఎగరేయద్దు' అని ఆమ్రపాలి కాట విజ్ఞప్తి చేశారు.
నిమజ్జనం నేపథ్యంలో.. హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శోభాయాత్ర జరిగే రోజు పాటించాల్సిన నియమాలను వివరించారు. పోలీసులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిమజ్జనం రోజున పాటించాల్సిన నియమాలు..
1.గణేష్ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు.
2.నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై సౌండ్ బాక్స్‌లు, డీజేలు అమర్చొద్దు.
3.నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లే వాహనంలో మద్యం, ఇతర మత్తు పధార్థాలను, మద్యం తాగిన వ్యక్తులను అనుమతించరు.
4.గణపతి నిమజ్జనం ఊరేగింపులో కర్రలు, కత్తులు, మండే పధార్థాలు, ఇతర ఆయుధాలను తీసుకురావొద్దు.
5.వెర్మిలియన్, కుంకుమ్, గులాల్‌ను సామాన్య ప్రజలపై జల్లకూడదు.
6.గణేష్ ఊరేగింపులో రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే నినాదాలు చేయొద్దు.
7.గణపతి ఊరేగింపు సమయంలో బాణాసంచా పేల్చొద్దు.
8.పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి.
9.ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. వెంటనే డయల్ 100 కి ఫోన్ చేయాలి.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచే ఖైరతాబాద్ గణేష్ తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఒంటిగంట వరకు నిమజ్జనానికి సాగర్‌కి తరలించేలా ప్లాన్ చేశారు. బాలాపూర్ గణేష్ ని కూడా సాయంత్రం 4 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుందని ఆశిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద షెడ్ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. రాత్రి 9 గంటలకు మహాగణపతికి కలశపూజ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం జరగనుంది.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. భారీ వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ సహా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.