Singareni Results: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం
Singareni Results: హోరాహోరీగా జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది. అర్థరాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపులో ఏఐటీయూసీకి 1999ఓట్ల ఆధిక్యత లభించింది.
Singareni Results: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీపై వామపక్ష అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘం దాదాపు 1999 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
సింగరేణిలో మొత్తం 11 ఏరియాలలో 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.
ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సింగరేణి కార్మికుల్లో మొత్తం 39,773 ఓట్లు ఉంటే వాటిలో 37,468 ఓట్లు పోలయ్యాయి.
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.20 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. సింగరేణి ఎన్నికల ప్రధానాధికారి శ్రీనివాసులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఎర్రజెండా రెపరెపలు…
సింగరేణిలో ఎర్ర జెండా రెపరెపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టారు.ఏఐటీయూసీ అనుబంధ ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ను కార్మికులు తమ గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్‌బెల్ట్ ప్రాంతం రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో ప్రాతినిధ్య సంఘంగా సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది. దీంతో సింగరేణి కాలరీస్‌లో ఏడోసారి జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీకి గుర్తింపు సంఘం హోదా లభించింది.
ఎన్నికల్లో చివరి వరకు ఏఐటీయూసీకి కాంగ్రెస్ అనుబంధ కార్మికసంఘం ఐఎన్‌టీయూసీ గట్టి పోటీ ఇచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-3, భూపాలపల్లి డివిజన్లలో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంఘం విజయం సాధించింది.
ప్రధాన ఏరియాలతో పాటు మెజారిటీ ఓట్లు సాధించిన ఏఐటీయూసీకి గుర్తింపు కార్మిక సంఘం హోదా దక్కింది. ఏఐటీయూసీకి మూడు వేల ఓట్ల పైచిలుకు మెజార్టీని సాధించింది. ఒక్క శ్రీరాంపూర్ డివిజన్‌లోనే 2166 ఓట్ల మెజార్టీని ఏఐటీయూసీ సాధించింది. మందమర్రి ఏరియాలో 261 ఓట్లతో ఏఐటీయూసీ విజయం సాధించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీకి నాలుగో సారి ఎన్నికైంది.
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు పోటీ పడ్డాయి. ఏఐటీయూసీని గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్‌టీయూసీనిప్రాతినిధ్య సంఘంగా కార్మికులు ఆమోదించారు. హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు ఏ ఒక్క డివిజన్‌లో కూడా కనీసం ప్రాతినిధ్యాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఏఐటీయూసీకి కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీకి మధ్యే తీవ్ర పోటీ జరిగింది.
ఏఐటీయూసీకి బీఆర్‌ఎస్ అనుబంధ ‘తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం’ బేషరతుగా మద్దతు ప్రకటించడంతో విజయం దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. సింగరేణి పరిధిలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ విజయం సాధించింది.
బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 94.15 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 39,773 మంది కార్మికులు ఉండగా, 37,458 మంది కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది.