Khammam District : ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు-a private bus overturned in khammam district 15 travelers were seriously injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam District : ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

Khammam District : ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

Private Bus Accident in Khammam: తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు పల్టీ

Private Bus Accident in Khammam: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూసుమంచి మండలం లోక్యతండ వద్ద తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

హైదరాబాదు నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళుతున్న పూరి జగన్నాథ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు కూసుమంచి మండలం లోక్యతండా వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఇటీవలే నిర్మించిన నేషనల్ హైవే పై బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోక్యా తండా వద్ద నిర్మించిన ఒక జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరగడంతో బస్సు బ్రిడ్జిపై నుంచి కిందకు పడడంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. డ్రైవర్ కునుకుపాటు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సరిగ్గా 3:30 గంటల సమయంలో బస్సు వంతెన పైనుంచి కిందికి మల్టీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బస్సు బ్రిడ్జి పైనుంచి పడడంతో భారీగానే దెబ్బతింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాపాయం సంభవించలేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.