Hyderabad : రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్.. రోడ్డెక్కి వేడుకున్న చిన్నారి!-a girl requested cm revanth reddy not to demolish her house in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్.. రోడ్డెక్కి వేడుకున్న చిన్నారి!

Hyderabad : రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్.. రోడ్డెక్కి వేడుకున్న చిన్నారి!

Basani Shiva Kumar HT Telugu
Sep 29, 2024 04:33 PM IST

Hyderabad : హైదరాబాద్ వాసులను కూల్చివేతల భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ వేయడంతో.. భయంతో రోడ్డెక్కారు. తమ ఇళ్లను కూల్చొద్దని అధికారులను వేడుకుంటున్నారు.

ఆందోళనలో పాల్గొన్న చిన్నారి
ఆందోళనలో పాల్గొన్న చిన్నారి

హైదరాబాద్ నగరంలో కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా.. మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు రోడ్డెక్కారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆందోళన చేపట్టారు. చిన్నారులు రోడ్డెక్కి.. ప్లకార్డులు, ఫ్లెక్సీలు చేత పట్టుకుని నినాదాలు చేశారు. 'రేవంత్ అంకుల్ మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్' అంటూ.. విజ్ఞప్తి చేశారు. చిన్నారుల నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఆందోళనలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 'కొందరు అవకాశవాదులు రెచ్చగొడుతున్నారు. మూసీని పరిరక్షించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదల ఇళ్లు పడగొట్టాలని ప్రభుత్వం చూడదు. రివర్‌ బెడ్‌లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. మూసీ బాధితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తున్నాం. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం. పేదలకు పక్కా ఇళ్లు ఇస్తున్నాం' అని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.

హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. '6 గ్యారంటీలు చూసి ప్రజలు మీకు ఓటేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పారు.. ఇళ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా.. రుణమాఫీ చేయకపోవడం ఇందిరమ్మ రాజ్యమా.. ఉద్యోగులను మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా.. మహిళలను మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా.. ఇళ్లు కోల్పోయిన పేదలను చూస్తే ఆవేదన కలుగుతోంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారి ఇళ్లను కూలుస్తారా' అని బండి సంజయ్ ప్రశ్నించారు.

హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్‌లో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామని వివరించారు. బఫర్ జోన్‌లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

'రేవంత్‌రెడ్డిది రాతి గుండె. మీకో రూల్‌.. పేదలకు మరో రూలా. మూసీ ప్రాంత వాసులకు అండగా ఉంటాం. అవసరమైతే రోజుకో ఎమ్మెల్యే ఇక్కడే ఉంటాం. బుల్డోజర్లు మమ్మల్ని దాటుకుని రావాల్సిందే. నోరెత్తని పేదలకు నోటీసులు ఇస్తున్నారు. బాధితుల తరపున కోర్టు నుంచి స్టే ఆర్డర్‌లు తెస్తాం. ఎప్పుడొచ్చినా తెలంగాణ భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయి' అని మాజీ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.