Karimnagar : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి
Karimnagar : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను మందలించారు. పెండింగ్ పనులన్ని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న కట్టడాలను త్వరలోనే విజిట్ చేస్తానని.. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్‌తో కలిసి.. మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ స్మార్ట్ సిటి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో మొత్తం 47 పనులు ప్రారంభించగా.. 25 పనులు పూర్తయ్యాయి. మరో 20 పనులు పొగ్రెస్‌లో ఉన్నాయి. రెండు పనులు ప్రారంభం కాలేదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
స్మార్ట్ సిటీలో ఇప్పటికే పూర్తైన, ప్రస్తుతం నడుస్తున్న పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సలహాలు సూచనలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలో చేపట్టిన పెండింగ్ పనులు నెల రోజుల్లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్‌లో 27 స్కూల్‌లు డెవలప్ చేయగా.. అందులో ఎన్ని పూర్తయ్యాయి.. మౌలిక వసతులు ఏం చేశారని ఆరా తీశారు. స్మార్ట్ సిటీలో భాగంగా పూర్తైన స్కూల్‌లు, ఇతర పనులను త్వరలోనే ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనుమతి లేని పనులపై ఆరా..
స్మార్ట్ సిటీలో భాగంగా అభివృద్ధి చేసుకున్న సర్కస్ గ్రౌండ్ నగర ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది.. దాని నిర్వహణలో వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. ఈ లెర్నింగ్ స్మార్ట్ క్లాస్ రూమ్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌లో అభివృద్ధి చేస్తున్న జంక్షన్‌లు, ఓల్డ్ పవర్ హౌజ్ జంక్షన్,హెచ్‌కేఆర్ జంక్షన్, సదాశివంపల్లి జంక్షన్, తెలంగాణ చౌక్ తదితర పనులను ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. కొన్ని జంక్షన్‌లకు అనుమతి లేకుండా ఇష్టారీతిన అంచనా విలువ పెంచారని.. వాటి వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌ను ఆదేశించారు.
డంపింగ్ యార్డ్ విషయంలో పీఏంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన విధానాలు పాటించకపోవడం వల్లే డంపింగ్ యార్డ్‌లో మంటలు అంటుకొని పొగ వస్తుందని ఫైర్ అయ్యారు. డంపింగ్ యార్డ్‌పై ఏం చేస్తే బాగుంటదన్న దానిపై అధికారులతో చర్చించారు. రోడ్లపై వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలపై ఆరా తీశారు. కమాండ్ కంట్రోల్‌లో సిటీ నుండి అనుసంధానం అయినా కెమెరా లు ఎన్ని.. ఎన్ని ప్రాంతాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారని వివరాలు తెలుసుకున్నారు.
మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వర్షపు నీటి ఇంకుడు గుంతలు, ధోభీఘాట్ పెండింగ్ ఎలక్ట్రిక్ కనెక్షన్‌లపై సూచనలు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో క్వాలిటీ, క్వాంటిటీ మెయింటెయిన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్జీటి కేసు డిసెంబర్ వరకు ఉండడంతో.. దానిపై ఏం చేస్తే బాగుంటదని అధికారులతో చర్చించారు.
మానేర్ రివర్ ఫ్రంట్ ఏమైంది..
మానేరు రివర్ ఫ్రంట్ పనులపై ఆరా తీసి.. పనులు ఎందుకు జరగడం లేదని మంత్రి ప్రశ్నించారు. అభివృద్ధి పనులఫై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌లో మంజూరైన నిధులు, ఇప్పటి వరకు చేసిన పనులు, ఇంకా చేయాల్సినవి బ్యూటిఫికేషన్ తదితర వాటిపై ఆరా తీశారు. రైలింగ్ ల్యాండ్ స్కెపింగ్, మ్యూజికల్ పార్క్ తదితర యానిమేషన్ చిత్రాలను పరిశీలించారు. మానేరు రివర్స్ ఫ్రంట్ డెవలప్మెంట్‌లో కేబుల్ బ్రిడ్జి బయట వరకు ఉండే నీటి నిల్వపై సూచనలు చేశారు.
(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)