Medaram Hundi Counting : మేడారం హుండీల్లో నకిలీ కరెన్సీ - గాంధీ స్థానంలో అంబేద్కర్ ఫొటోలు
Medaram Hundi Counting 2024: మేడారం జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇందులో నకిలీ కరెన్సీ నోట్లు వెలుగు చేశాయి. ఈ నోట్లపై అంబేడ్కర్ ఫొటోలు దర్శనమిచ్చాయి.
Medaram Hundi Counting 2024: మేడారం మహాజాతర హుండీల(Medaram Hundi Counting 2024) లెక్కింపు షురూ అయ్యింది. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు ప్రారంభం కాగా.. వాటిలో విదేశీ కరెన్సీతో పాటు నకిలీ నోట్లు కూడా దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ ఫొటోకు బదులు రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ ఫొటో ఉన్న రూ.100 నోట్లను హుండీల్లో సమర్పించారు. దీంతో హుండీ లెక్కిస్తున్న సిబ్బంది వాటిని చూసి అవాక్కయ్యారు. వెంటనే అక్కడున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నకిలీ నోట్లను హుండీల్లో వేసిన పలువురు భక్తులు కరెన్సీ నోట్లపై అంబే ద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ వెనక వైపు ప్రింట్ కూడా చేయించారు. దీంతో అధికారులు వాటిని సేకరించి భద్రపరిచారు. గురువారం ఉదయం ఇలాంటివి ఆరు నోట్లు బయట పడగా.. ఇంకా ఎన్ని హుండీల్లో ఇలాంటి నోట్లు బయటపడతాయోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
535 హుండీలు.. 10 రోజుల పాటు లెక్కింపు
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం హుండీ లెక్కింపు జరగగా.. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఒడిబియ్యంతో పాటు మొక్కుకున్న ప్రకారం ముడుపులు కూడా సమర్పించారు. కాగా మేడారం జాతర నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తంగా 535 హుండీలను ఏర్పాటు చేశారు. అందులో సమ్మక్క గద్దెల వద్ద 215, సారలమ్మ గద్దెల సమీపంలో 215, పగిడిద్దరాజు గద్దెల వద్ద 26, గోవిందరాజుల గద్దె వద్ద 26, మరో 30 క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 512 హుండీలతో పాటు తిరుగువారం నేపథ్యంలో మరో 23 హుండీలను కూడా సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాటు చేశారు. మొత్తంగా 535 హుండీలు కాగా.. జాతర ముగిసిన అనంతరం గత సోమవారమే 512 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపానికి చేర్చారు. తిరుగువారం పూర్తి కాగా.. మిగతా 23 హుండీలను కూడా తీసుకొచ్చారు. ఈ మొత్తం హుండీల లెక్కింపు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, భక్తి మండళ్ల సభ్యులు లెక్కింపు భాగస్వామ్యం అయ్యారు. ఈ 535 హుండీలను 10 రోజుల పాటు లెక్కించనున్నారు.
పోలీస్ పహారా.. సీసీ కెమెరాల ఏర్పాటు
మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియను ప్రతి సంవత్సరం లాగానే హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండలంలో ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు పోలీస్ పహారా ఉండటంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. దీంతో పటిష్ట బందోబస్తు నడుమ గురువారం హుండీ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. హుండీల లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత పర్యవేక్షించారు. మొత్తంగా 350 మంది వరకు సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు.
గత జాతరకు 12 కోట్ల ఆదాయం
గత మేడారం జాతర 2022 లో ఆ సంవత్సరం 512 హుండీలు ఏర్పాటు చేశారు. ఆయా హుండీల్లో దాదాపు రూ.12 కోట్ల వరకు కానుకలు వచ్చాయి. ఈ సారి గత జాతర కంటే ఎక్కువ మంది భక్తులు తరలిరాగా.. హుండీల సంఖ్య కూడా పెంచారు. దీంతో ఈసారి హుండీల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే హుండీలో భక్తులు వేసిన ఒడిబియ్యం, కరెన్సీ నోట్లు, కాయిన్స్ వేరు చేసేందుకు ఈసారి మూడు మెషీన్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బియ్యం, నోట్లు, కాయిన్స్ జల్లెడ పడుతూ లెక్కింపు ప్రక్రియను సులువు చేస్తున్నారు. లెక్కింపులో బంగారు, వెండి, ఇతరత్రా కానుకలుకూడా బయటపడే అవకాశం ఉండగా.. పటిష్ట బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వారం నుంచి పది రోజుల్లోగానే లెక్కింపు మొత్తం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.