AP New Liquor Policy : వారంలో ఒక రోజు మద్యం అమ్మకాలను ఆపేయాలి - మహిళా సంఘాలు డిమాండ్
ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలని సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. వారంలో ఒక రోజు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపివేయాలని కోరింది. ఆ రోజు డ్రై డేగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.ఆదాయాన్ని తగ్గించుకునే లక్ష్యంతో నూతన మద్యం పాలసీని రూపొందించాలని సూచించింది.
వారంలో ఒక రోజు మద్యం అమ్మకాఆలు ఆపాలని, ఆ రోజు డ్రై డేగా ప్రకటించాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మహిళా సంఘాల నేతలు ఐక్యంగా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మద్యపానాన్ని నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారంలో ఒక రోజును డ్రైడేగా ప్రకటించాలని, ఆ రోజున అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా, ఇప్పుడున్న తరహాలో ప్రభుత్వమే నిర్వహించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదనను ఐక్య వేదిక ఉంచింది. మహిళా సంఘాల ఐక్య వేదిక (మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక) నాయకులు డీ.రమాదేవి, సుంకర పద్మశ్రీ, పీ.దుర్గాభవాని, పీ.పద్మ, ఎస్ విష్ణు తదతరులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తామని మాట తప్పిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మద్యపాన నిషేదాన్ని అమలు చేయకపోగా, నాణ్యత లేని మద్యాన్ని అమ్మడం వల్ల అనారోగ్యం పాలై దాదాపు 30 వేల మంది మరణిచారని టీడీపీ నేతలు చెప్పేవారని అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామంటూ బాధ్యతలేని ప్రకటన చేశారని విమర్శించారు. నాణ్యత కూడిన మద్యం ఆరోగ్యాన్ని, ప్రజల ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నాం చేయదా…? అని ప్రశ్నించారు. మద్యపానంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రజల్లో నేర ప్రవృత్తి బాగా పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న మద్యం పాలసీలో మద్యం నియంత్రణకు అవకాశం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
మద్యం షాపులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దక్కించుకోకుండా సాంప్రదాయ వ్యాపారులు మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బెల్ట్ షాపులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడి, బడి, బస్టాండ్‌లకు దూరంగా మద్యం షాపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతాన్ని మద్యపానంతో వచ్చే నష్టాలకు సంబంధించిన ప్రచారాలను చేయాలని సూచించారు. ప్రతి పీహెచ్‌సీ పరిధఙలో డీ ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. తాగుడు కారణంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా అమ్మకాలు తగ్గించడం, షాపుల కుదింపు, ఆదాయాన్ని తగ్గించుకునే లక్ష్యంతో నూతన మద్యం పాలసీని రూపొందించాలని అన్నారు.