HIV : మూడేళ్ల చిన్నారికి హెచ్ఐవీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మూడేళ్ల బాలుడి జీవితం అంధకారంలోకి వెళ్లింది. తలసేమియా కారణంగా నిత్యం రక్తం మార్పిడి చేసుకుంటున్న అతడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
నిత్యం రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియా వ్యాధిగ్రస్థుడైన మూడేళ్ల బాలుడికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో నల్లకుంట పోలీసులు విద్యానగర్‌లోని ఓ బ్లడ్ బ్యాంక్‌పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రతి పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించుకునేందుకు కుటుంబసభ్యులు విద్యానగర్‌లోని బ్లడ్ బ్యాంక్‌ను ఆశ్రయించేవారు.
జులై 20న రక్తం ఎక్కించడానికి తల్లిదండ్రులు బిడ్డను బ్లడ్ బ్యాంక్‌కు తీసుకొచ్చారు. వైద్యాధికారులు హెచ్‌ఐవీ పరీక్ష నిర్వహించి చిన్నారికి పాజిటివ్ అని చెప్పారని నల్లకుంట పోలీసులు తెలిపారు. పోలీసులు బ్లడ్ బ్యాంక్‌లోని వైద్యులను విచారించగా కొన్ని సందర్భాల్లో రక్తమార్పిడి కోసం కుటుంబం ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దాతల నుండి రక్తాన్ని సేకరించే ముందు ఎటువంటి వ్యాధి లేదని నిర్ధారించేందుకు అనేక పరీక్షలు చేస్తామన్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
ఏడు నెలల నుంచి రక్త మార్పిడి చేయిస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదని చిన్నారి తండ్రి శివ అంటున్నారు. గత నెలలో తమ కొడుకుకు రక్త మార్పిడి కోసం రెడ్ క్రాస్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చారని తెలిపారు. తనతో పాటు తన భార్యకు కూడా టెస్టులు చేయిస్తే హెచ్ఐవీ లేదని రిపోర్టులు వచ్చాయన్నారు. జులై 28న తమ కొడుకుకు రక్త మార్పిడి కోసం వెళ్లిన సమయంలో రెడ్ క్రాస్ సిబ్బంది ఈ విషయం చెప్పారన్నారు. జులై 30న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా శివ తెలిపారు. ఈ కేసుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.