Sangareddy District : గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్ - 25 జీవాలు మృతి
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ఘటనలో 25 మూగ జీవాలు మృతి చెందాయి. మరికొన్ని గాయాలపాలయ్యాయి. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలోని నాందేడ్ జాతీయ రహదారిపై జరిగింది. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు… వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాందేడ్ జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెల మందపైకి అతివేగంగా వచ్చిన టిప్పర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 25 మేక పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. పలు జీవాలు గాయాలపాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట వద్ద 161 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం నారాయణపేట జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు గొర్రెల మందను మేపుకుంటూ ఒకచోటు నుండి మరొక చోటుకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దీ రోజులుగా గొర్రెలను సంగుపేట జాతీయ రహదారి వెంట మేపుతూ ఉన్నారు. రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం గొర్రెల మందను జాతీయ రహదారి పక్కన మేపుతూ రోడ్డు దాటిస్తుండగా ఒక్కసారిగా అతివేగంగా వస్తున్న టిప్పర్ మందపైకి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో 25 మేక పిల్లలు నుజ్జునుజ్జయ్యాయి. పలు జీవాలు గాయాలపాలయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని గొర్రెల కాపర్లు వాపోతున్నారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని, టిప్పర్ ను పోలీసుస్టేషన్ కు తరలించారు. గొర్రెల కాపరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు.
వీధికుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి:
గొర్రెల కొట్టంపై వీధికుక్కలు దాడి చేయగా…. 12 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన ధూపతి రాజు మంగళవారం సాయంత్రం గొర్రెలను కొట్టంలో ఉంచి ఇంటికి వెళ్ళాడు.
బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి ఆ గొర్రెల కొట్టంపై వీధికుక్కలు దాడి చేయగా 12 గొర్రెలు మృతువాతపడ్డాయి. మరికొన్ని గాయాల పాలయ్యాయి. ఆ మృతి చెందిన గొర్రెలను చూసి రాజు తీవ్ర ఆవేదన చెందారు. సుమారు రూ. 2 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఘటనా స్థలానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులూ అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీధి కుక్కల దాడిలో అనేక మూగ జీవాలు మృతి చెందాయన్నారు.
పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని .... ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కాగా బాధిత కుటుంబానికి తమ వంతు సాయంగా రూ. 10 వేలు అందజేశారు.