Sangareddy : సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
Sangareddy : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. పొలం పనులకు వెళ్లి.. ఇంటికి తిరిగొస్తున్న వారిని కర్ణాటక ఆర్టీసీ బస్సు బలిగొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బస్సు బలంగా ఢీ కొట్టడంతో.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం గణేష్‌పూర్‌కి చెందిన గూనెల్లి సిద్రమ్(60), ఆయన కూతురు రేణుక (45), అల్లుడు బిరాధర్ జగన్నాథం(50), మనవడు వినయ్ కుమార్(19).. నలుగురు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై ఉదయం పొలం పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం బైక్‌పై గణేష్‌పూర్‌కి తిరిగి వస్తున్నారు.
వీరు హుసేల్లి బస్టాప్ వరకు వచ్చారు. అదే సమయంలో జహీరాబాద్ నుండి బీదర్ వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ.. బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృతి చెందడంతో గణేష్‌పూర్ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
మెదక్‌లో మరో ఘటన..
పని ముగించుకొని ఇంటికి బైక్ పై తిరిగొస్తున్న క్రమంలో వెనక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన ముత్యం వెంకట్ (38) రామాయంపేట పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలోనే రామాయంపేటలోని షాప్‌కి వెళ్లి ద్విచక్ర వాహనంపై అక్కన్నపేటకు తిరిగి వస్తున్నాడు. అక్కన్నపేట గ్రామ శివారులోని ఫకీర్ సాబ్ గుట్ట వద్దకు రాగానే.. వెంకట్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు.