Yuzvendra Chahal: చహల్ ఇంకొక్క వికెట్ తీస్తే ఐపీఎల్లో కొత్త చరిత్రే
Yuzvendra Chahal: చహల్ ఇంకొక్క వికెట్ తీస్తే ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం (మే 7) జరిగిన మ్యాచ్ లో చహల్.. డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు.
Yuzvendra Chahal: ఐపీఎల్లో చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్. ఈ మెగా లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డ్వేన్ బ్రావో పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఇక ఇప్పుడు తర్వాతి మ్యాచ్ లో ఆ రికార్డు బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్ 2023లో జరిగిన 52వ మ్యాచ్ లో చహల్ ఈ రికార్డు అందుకోవడం విశేషం.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం (మే 7) జరిగిన మ్యాచ్ లో చహల్.. బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ లో చివరి బంతికి సన్ రైజర్స్ గెలిచినా.. రాయల్స్ కు చహల్ రికార్డు కాస్త ఊరట కలిగించే విషయం. చహల్ ఇప్పటి వరకూ 142 ఐపీఎల్ మ్యాచ్ లలో 183 వికెట్లు తీశాడు. బ్రావో కూడా ఐపీఎల్లో 183 వికెట్లు తీసి టాప్ లో కొనసాగుతున్నాడు.
ఇక ఈ ఇద్దరి తర్వాత పియూస్ చావ్లా (174), అమిత్ మిశ్రా (172), రవిచంద్రన్ అశ్విన్ (171) ఉన్నారు. ఎస్ఆర్‌హెచ్ తో మ్యాచ్ లో చహల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో చహల్ మాత్రం 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠీ, హెన్రిచ్ క్లాసెన్, ఏడెన్ మార్‌క్రమ్ లాంటి కీలకమైన వికెట్లతో రాయల్స్ ను టాప్ లో నిలిపాడు.
అయితే అతని అద్భుతమైన స్పెల్ రాయల్స్ కు విజయం సాధించి పెట్టలేకపోయింది. చివరి ఓవర్ చివరి బంతికి సందీప్ శర్మ నోబాల్ వేయడం రాయల్స్ కొంప ముంచింది. చివరి బంతికి విజయం కోసం 4 పరుగులు అవసరం కాగా.. అబ్దుల్ సమద్ సిక్స్ కొట్టి సన్ రైజర్స్ కు ఊహకందని విజయాన్ని సాధించి పెట్టాడు.
ఈ మ్యాచ్ లో ఓడిపోయినా.. తమకు ప్లేఆఫ్స్ కు వెళ్లేందుకు మంచి అవకాశం ఉందని చహల్ అన్నాడు. తర్వాతి మూడు మ్యాచ్ లలో గెలవడానికి ప్రయత్నిస్తామని, ఈ ఓటమి నుంచి తేరుకొని మళ్లీ గాడిలో పడతామని అతడు స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం