SRH Vs RR : మెరిసిన సన్‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం
IPL 2023 SRH Vs RR : రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఓడిపోయాం అనుకునే సమయంలో హైదరాబాద్ గెలిచింది. ఒక్క నోబాల్ గెలిచేందుకు కారణమైంది.
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మీద సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) గెలిచింది. హైదరాబాద్ గెలవాలంటే.. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉంది. సందీప్ శర్మ వేసిన బాల్ ను ఎదుర్కొన్న అబ్దుల్ సమద్.. గట్టిగా కొట్టాడు. క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ అది నో బాల్. దీంతో మరో బంతి వేయాల్సి వచ్చింది. సమద్ చివరి బంతిని సిక్సర్‌గా బాదాడు. దీంతో సన్ రైజర్స్ ఎవరూ ఊహించని విధంగా గెలిచేసింది.
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్(Sunrisers) చివరి బంతికి 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి విజయం సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది సన్‌రైజర్స్. ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మలు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్‌ప్లేలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 51 పరుగులు చేశారు. 33 పరుగులు చేసిన సింగ్.. చాహల్ బౌలింగ్‌లో హెట్మెయర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 34 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.
ఓ వైపు రాజస్థాన్ బౌలర్లు రెచ్చిపోతున్నా.. హైదరాబాద్ జట్టు నిలకడగా ఆడింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) బాగా ఆడారు. రాహుల్ త్రిపాఠి (47) పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన క్లాసెన్ (26) పర్వాలేదనిపించాడు. మార్క్రమ్ (6), గ్లెన్ ఫిలిప్స్ (25) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీశాడు. రవి చంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు రాజస్థాన్ జట్టు(Rajasthan Team) టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. మొదటి నుంచి దూకుడుగా ఆడింది రాజస్థాన్ జట్టు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (35) మెరిశాడు. టి నటరాజన్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95 పరుగులు; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో అదరగొట్టాడు. సంజు శాంసన్ 66 పరుగులు చేశాడు. హిట్మయర్ 7 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో జాన్సెన్ చెరో వికెట్ తీసుకున్నారు.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్(yashasvi jaiswal) తన ఐపీఎల్ కెరీర్‌లో 1,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 2020లో అరంగేట్రం చేసిన యశస్వీ ఈ మైలురాయిని చేరుకోవడానికి 34 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. టోర్నీలో 1000 పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు రిషబ్ పంత్ ఈ ఘనత సాధించాడు. జైస్వాల్ 21 ఏళ్ల 130 రోజుల వయసులో ఈ మైలురాయిని చేరుకోగా, పంత్ 20 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు.