Tree emoji in CSK vs GT: డాట్ బాల్ పడితే ట్రీ ఎమోజీ.. ఇలా ఎందుకు చేశారో తెలుసా?
Tree emoji in CSK vs GT: డాట్ బాల్ పడితే ట్రీ ఎమోజీ.. ఇలా ఎందుకు చేశారో తెలుసా? ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో భాగంగా ప్రతి డాట్ బాల్ పడినప్పుడు స్కోరుబోర్డులో ట్రీ ఎమోజీ చూపించడం వెనుక పెద్ద కారణమే ఉంది.
Tree emoji in CSK vs GT: ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం (మే 23) గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న తొలి క్వాలిఫయర్ లో ప్రేక్షకులను ఒకటి బాగా ఆకర్షించింది. స్కోరుబోర్డులో సాధారణంగా ఓ బంతికి పరుగు రాకపోతే డాట్ చూపిస్తారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఓ చెట్టు ఎమోజీని చూపించడం విశేషం.
డాట్ బాల్ పడిన ప్రతిసారీ డాట్ తోపాటు ట్రీ ఎమోజీని కూడా చూపించడం చాలా మంది అభిమానులను అయోమయానికి గురి చేసింది. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. అయితే దీనివెనుక పెద్ద కారణమే ఉంది. ఒక్కో డాట్ బాల్ పడిన సందర్భంలో బీసీసీఐ 500 చెట్లు నాటాలని నిర్ణయించిందట. అందుకే అలా ట్రీ ఎమోజీని చూపిస్తున్నట్లు కామెంటేటర్ సైమన్ డౌల్ వెల్లడించాడు.
పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది రియాక్టయ్యారు. కొందరు ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. నిజానికి ఈ సీజన్ ఐపీఎల్లో ఇలాంటి కార్యక్రమాలను ఆయా ఫ్రాంఛైజీలు కూడా చేపట్టడం విశేషం.
ఆర్సీబీ టీమ్ ప్రతి సీజన్ లో ఒక మ్యాచ్ తమ రెగ్యులర్ జెర్సీల్లో కాకుండా గ్రీన్ జెర్సీల్లో ఆడుతుంది. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్న సందేశం ఇస్తూ ఆర్సీబీ టీమ్ ఈ కార్యక్రమం చేపట్టింది. అటు ఈ ఏడాది గుజరాత్ టైటన్స్ కూడా ఒక మ్యాచ్ లో లావెండర్ జెర్సీల్లో బరిలోకి దిగింది. క్యాన్సర్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్లు అలా చేశారు. తాజాగా బీసీసీఐ కూడా ఇలా డాట్ బాల్ కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది.
సంబంధిత కథనం