Simon Doull on Rohit: రోహిత్ అన్నింటినీ వదిలేసి స్వేచ్ఛగా ఆడాలి.. సైమన్ డౌల్ సూచన
Simon Doull on Rohit: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడు అన్నింటిని వదిలేసి ఐపీఎల్‌లో స్వేచ్ఛగా ఆడాలని స్పష్టం చేశారు. మరోవైపు ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ సాధించడానికి అన్నీ అర్హతలున్నాయని తెలిపారు.
Simon Doull on Rohit: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ దగ్గర పడుతున్న తరుణంలో అతడు విశ్రాంతి తీసుకోవాలని, ఆటకు గాస్త విరామం ఇవ్వాలని పలువురు మాజీలు సలహాలు ఇస్తున్నారు. టీమిడియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ రోహిత్ ఫామ్‌పై స్పందించారు. హిట్ మ్యాన్ ఐపీఎల్‌లో వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఆడాల్సిన అవసరముందని, విరాట్ కోహ్లీ మాదిరిగా ఐపీఎల్‌లో కెప్టెన్సీని వదిలేసి బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని చెప్పకనే చెప్పారు.
"విరాట్ కోహ్లీని కెప్టెన్సీ వదులుకోమని ప్రతిపాదించిన వాళ్లలో నేను కూడా ఒకడిని. ఇప్పుడు రోహిత్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అతడు స్వేచ్ఛగా ఆడాలని అనుకుంటున్నాను." అని సైమన్ డౌల్ తెలిపారు.
"కోహ్లీ కెప్టెన్సీ దగ్గరకొస్తే సారథ్య బాధ్యతలున్నప్పుడు అతడిలో ఒత్తిడి ఎక్కువగా ఉందని భావిస్తున్నాను. టీమిండియాకు మూడు ఫార్మాట్లతో పాటు ఆర్సీబీ కెప్టెన్‌గానూ అతడు వ్యవహరించాడు. వైదొలిగిన తర్వాత అతడి ఒత్తిడి తగ్గింది." అని సైమన్ డౌల్ అన్నారు.
ఆర్సీబీకి తీరని కోరికగా ఐపీఎల్ టైటిలేనని సైమన్ డౌల్ తెలిపారు. "బెంగళూరు జట్టుకు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ కల తీరలేదు. తర్వాత వచ్చిన జట్లు సైతం అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుని వెళ్తే.. ఆర్సీబీకి మాత్రం సాధించలేకపోయింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ ఎందుకు దక్కలేదా? అని ఆశ్చర్యపోక మానరు. మరి ఈ సంవత్సరమైనా ఆ కోరిక తీరుతుందో చూడాలి" అని సైమన్ డౌల్ తెలిపారు.
ఆర్సీబీ తన చివరి లీగ్ మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. మే 21న ఈ మ్యాచ్ జరగనుంది. మరోపక్క ముంబయి ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తన గత మ్యాచ్‌లో ఓడింది. తన చివరి లీగ్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.