Theft in Delhi Capitals camp: ఢిల్లీ క్యాపిటల్స్ టైమ్ అస్సలు బాలేదు.. రూ.16 లక్షలు విలువైన బ్యాట్లు చోరీ
Theft in Delhi Capitals camp: ఢిల్లీ క్యాపిటల్స్ టైమ్ అస్సలు బాలేదు. రూ.16 లక్షలు విలువైన బ్యాట్లు చోరీ అయ్యాయట. ఈ సీజన్లో ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిన ఆ టీమ్ ను ఈ చోరీ షాక్ కు గురి చేసింది.
Theft in Delhi Capitals camp: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ టైమ్ ఈ మధ్య దారుణంగా నడుస్తోంది. ఐపీఎల్ 2023లో వరుస పరాజయాలతో కుంగిపోయిన ఆ టీమ్ క్యాంప్ లో తాజాగా భారీ చోరీ జరగడం షాక్‌కు గురి చేసింది. ఏకంగా రూ.16 లక్షల విలువైన బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర సామగ్రిని ఎవరో ఎత్తుకెళ్లినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది.
టీమ్ బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్లేయర్స్ తమ కిట్ బ్యాగులను చూసిన తర్వాత షాక్ తిన్నారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహా పలువురు ఇతర ప్లేయర్ల బ్యాట్లు కనిపించలేదు. వార్నర్, ఫిల్ సాల్ట్ లకు చెందిన మూడేసి బ్యాట్లు, మిచెల్ మార్ష్ కు చెందిన రెండు బ్యాట్లు, యశ్ ధుల్ కు చెందిన ఐదు బ్యాట్లు చోరీకి గురైనట్లు గుర్తించారు.
బ్యాట్లే కాకుండా పలువురు ప్లేయర్ల షూస్, గ్లోవ్స్, ఇతర సామగ్రి చోరీకి గురయ్యాయి. తమ వస్తువులు కనిపించకపోవడంతో ప్లేయర్స్ షాక్ తిన్నారని డీసీ టీమ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా జరగడం ఇదే తొలిసారని, దీనికి సంబంధించి తాము లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ తోపాటు పోలీసులు, ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాయి.
ఇందులో విదేశీ ప్లేయర్స్ కు చెందిన బ్యాట్లలో ఒక్కొక్కటి సుమారు రూ.లక్ష విలువ చేసేవి కావడం గమనార్హం. గురువారం (ఏప్రిల్ 20) డీసీ టీమ్ తమ తర్వాతి మ్యాచ్ లో కేకేఆర్ తో తలపడనుంది. తమ కిట్లలో చాలా వరకూ సామగ్రి చోరీకి గురైనా.. డీసీ టీమ్ ప్రాక్టీస్ కొనసాగించింది. ఆయా ప్లేయర్స్ వెంటనే కొత్త బ్యాట్లను తెప్పించుకునే పనిలో ఉన్నారు.
సాధారణంగా ఐపీఎల్లో ప్లేయర్స్ కిట్లను తీసుకెళ్లడానికి ఓ లాజిస్టిక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ కంపెనీయే క్రికెటర్ల వస్తువులకు పూర్తి బాధ్యత వహిస్తుంది. అయితే ఐపీఎల్లో తొలిసారి ఇలా భారీ స్థాయిలో ప్లేయర్స్ సామగ్రి చోరీకి గురైంది. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఓడిన డీసీ.. పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది.
సంబంధిత కథనం