Harbhajan on Dhoni: ధోనీ చాలా కూల్.. అతనిలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు అని అందరూ అంటుంటారు. కానీ అతడు చాలా ఎమోషనల్ అని, ఆ రోజు ధోనీ ఏడవడం తాను చూశానని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ఇది 2018 ఐపీఎల్ సందర్భంగా జరిగినట్లు భజ్జీ చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసిన ఓ వీడియోలో సాటి కామెంటేటర్లతో హర్భజన్ దీని గురించి మాట్లాడటం చూడొచ్చు.
2018లో రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి ఐపీఎల్లో అడుగుపెట్టింది. ఆ రెండేళ్లూ కొత్త టీమ్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ధోనీ.. తిరిగి సీఎస్కేలోకి వచ్చాడు. ఇదే అతన్ని ఎమోషనల్ చేసింది. ఆ సందర్భంగానే ధోనీ కంటతడి పెట్టినట్లు భజ్జీ తెలిపాడు. మగవాళ్లు ఏడవరని అందరూ అంటుంటారని, కానీ ఆ రోజు ధోనీ ఏడవడం తాను చూశానని చెప్పాడు.
"నేను మీతో ఓ స్టోరీ పంచుకోవాలని అనుకుంటున్నాను. 2018లో రెండేళ్ల నిషేధం తర్వాత సీఎస్కే తిరిగి ఐపీఎల్ కు వచ్చిన సందర్భంగా టీమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. సాధారణంగా మగవాళ్లు ఏడవరని అంటుంటారు. కానీ ధోనీ మాత్రం ఆ రాత్రి ఏడ్చాడు. అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదు. అంతేకదా ఇమ్రాన్" అంటూ పక్కనే ఉన్న ఇమ్రాన్ తాహిర్ తో భజ్జీ అన్నాడు.
దీనికి తాహిర్ స్పందిస్తూ.. "అవును, నిజమే. నేను కూడా అక్కడ ఉన్నాను. ధోనీకి అది చాలా ఎమోషనల్ మూమెంట్. అతన్ని అలా చూసిన తర్వాత ఈ జట్టుతో అతనికి ఎలాంటి బంధం ఉందో అర్థమైంది. జట్టును తన కుటుంబంగా అతడు భావిస్తాడు. మా అందరికీ అది చాలా ఎమోషనల్ మూమెంట్" అని హర్భజన్ స్పష్టం చేశాడు.
ఆ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తమ మూడో ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత జట్టుతో కలిసి ధోనీ సెలబ్రేట్ చేసుకోకుండా హోటల్ కు వెళ్లిపోయాడని, అదేంటని అడిగితే.. తన పని అంతటితో ముగిసిందని చెప్పాడని హర్భజన్ తెలిపాడు. 2018లో దాదాపు టీమ్ మొత్తం 30 ఏళ్లు పైబడిన వాళ్లే ఉండటంతో ముసలోళ్ల టీమ్ అని సీఎస్కేను ట్రోల్ చేసినా.. ఆ టీమ్ టైటిల్ గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది.
సంబంధిత కథనం