Gavaskar on Prithvi Shaw: పృథ్వీ 400 కొడితే బాగుండేది.. సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు: గవాస్కర్
Gavaskar on Prithvi Shaw: పృథ్వీ 400 కొడితే బాగుండేదని, అయినా ఈ ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడని అన్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. రంజీ ట్రోఫీ పృథ్వీ అస్సాంతో మ్యాచ్‌లో ముంబై తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 379 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Gavaskar on Prithvi Shaw: చాలా కాలంగా డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ నేషనల్ టీమ్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్న ప్లేయర్ పృథ్వీ షా. తాను మంచి స్కోర్లు సాధిస్తున్నా తనను ఎంపిక చేయకపోవడంపై గతంలో పబ్లిగ్గానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా రంజీ ట్రోఫీలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 379 రన్స్ చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇండియా తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.
ఈ మారథాన్ ఇన్నింగ్స్‌తో మరోసారి అతడు నేషనల్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత తన విమర్శకులకు కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. తన గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా తనను విమర్శించారని పృథ్వీ అన్నాడు. అయితే తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పృథ్వీపై ప్రశంసలు కురిపించాడు.
శ్రీలంకతో రెండో వన్డే సందర్భంగా కామెంట్రీ ఇచ్చిన సన్నీ.. పృథ్వీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడు 400 కొడితే బాగుండేదని అన్నాడు. అయితే అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్సే ఆశించినట్లు కూడా చెప్పాడు. "అతని నుంచి కావాల్సింది ఇదే. అతడు 60లు, 70లు బాగా స్కోరు చేస్తున్నాడు. అయితే ఎంతో మంది ఇతర బ్యాటర్లు కూడా ఈ 60లు, 70లు చేస్తున్నారు. నిజంగా సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాలంటే పెద్ద సెంచరీలు చేయాలి. డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేయాలి. పృథ్వీ 400 కొట్టేంత పని చేశాడు. 400 చేసి ఉంటే బాగుండేది" అని రెండో వన్డే కామెంట్రీ ఇస్తూ గవాస్కర్ అన్నాడు.
"అసలు ముంబైకి డిక్లరేషన్ నిర్ణయాన్ని కూడా క్లిష్టతరం చేశాడు. ఎందుకంటే అతడు రంజీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 443కు చేరవగా వెళ్తున్నాడు. ఆ 443 స్కోరు అందుకోవాలని ఎవరికైనా ఉంటుంది" అని కూడా గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. నిజంగా పృథ్వీ షా ఈ మారథాన్ ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలోనే అతనికి నేషనల్ టీమ్ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ ఇన్నింగ్స్ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పృథ్వీని ప్రశంసించాడు.
సంబంధిత కథనం