Rohit Sharma: రోహిత్ చివరిసారి ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలుసా?-cricket news india won world cup when rohit sharma last batted at number 7 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma: రోహిత్ చివరిసారి ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలుసా?

Rohit Sharma: రోహిత్ చివరిసారి ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలుసా?

Hari Prasad S HT Telugu
Jul 28, 2023 05:07 PM IST

Rohit Sharma: రోహిత్ చివరిసారి ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలుసా? తాజాగా అతడు వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలోనూ అదే స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు.

తొలివన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ
తొలివన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ (AP)

Rohit Sharma: వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయకుండా ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ లను ఓపెనింగ్ పంపించారు. ఇక మూడో స్థానంలో రావాల్సిన కోహ్లి కూడా డిమోట్ అయ్యాడు. ఏడో స్థానంలో వచ్చిన రోహిత్ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.

yearly horoscope entry point

ఇండియా ఐదు వికెట్లతో గెలిచింది. అయితే మ్యాచ్ తర్వాత తాను గతంలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సందర్భాన్ని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రోహిత్ ఇలా ఏడోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఏడాదే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. చివరిసారి 2011 జనవరిలో సౌతాఫ్రికాతో వన్డేలో ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడు.

అదే ఏడాది ఏప్రిల్ లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఆ వరల్డ్ కప్ జట్టులో రోహిత్ కు చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు కూడా మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ ఏకంగా కెప్టెన్ గా ఉన్నాడు. మరి ఈసారి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అన్న ఆశతో అభిమానులు ఉన్నారు.

తన బ్యాటింగ్ స్థానంపై మ్యాచ్ తర్వాత రోహిత్ స్పందిస్తూ.. "నేను ఇండియా తరఫున అరంగేట్రం చేసినప్పుడు ఏడో స్థానంలో ఆడాను. నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. 2011 నాకు అసలు కలిసి రాలేదు. వరల్డ్ కప్ జట్టులో నేను లేను. దానికి నన్ను నేనే నిందించుకోవాలి. నేను నా ఆటపై దృష్టి సారించాను.

యోగా, మెడిటేషన్, ఒంటరిగా ఉండటం నాకు చాలా సాయం చేశాయి. నేను మారాల్సిన అవసరం ఉందని, ఒకవేళ నేను మెరుగవ్వకపోతే మళ్లీ క్రికెట్ ఆడలేను అన్న విషయం అర్థమైంది. 2014-15 మధ్య నేను చాలా మారాను. లేదంటే నేను కొనసాగలేనన్న విషయం నాకు అర్థమైంది" అని రోహిత్ అన్నాడు.

వన్డే స్పెషలిస్టులకు క్రీజులో తగినంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను, విరాట్ బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన రావాలని నిర్ణయించుకున్నట్లు రోహిత్ చెప్పాడు. తొలి వన్డేలో ఇండియా 5 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించిన విషయం తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం